- సిద్దిపేటలో నిరుద్యోగం, ఉపాధి లేక వలసలు
- టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు లోక రవిచంద్ర విమర్శలు
- నవంబర్ 13న జిల్లా కార్యాలయానికి భూమిపూజ
- నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు పోరాటం
- గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తాం
- 30న ఇంద్రవెల్లి పాంచజన్య సభకు తరలిరావాలి
ప్రతిపక్షం ప్రతినిధి, సిద్దిపేట, అక్టోబర్ 28: “చదువుకున్న వారు అమెరికా.. చదువుకోనివారు దుబాయ్.. ఉపాధి అవకాశాలు లేనివారు సిద్దిపేటలో ఆటోలు నడుపుకునే పరిస్థితి ఏర్పడింది” అని తెలంగాణ రక్షణసేన సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు లోక రవిచంద్ర వ్యాఖ్యానించారు. జిల్లాలో నిరుద్యోగం, ఉపాధి కోసం వలసలు, నిర్వాసితుల సమస్యలపై ప్రభుత్వాలు దృష్టి సారించాలని కోరారు. సామాజిక తెలంగాణ సాధనే లక్ష్యంగా ప్రజల పక్షాన పోరాటం సాగిస్తామని స్పష్టం చేశారు. సిద్దిపేటలో పార్టీ తొలి జిల్లా కార్యాలయ నిర్మాణానికి నవంబర్ 13న అధినేత్రి కల్వకుంట్ల కవిత భూమిపూజ చేయనున్నట్లు ప్రకటించారు. సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పార్టీ నియోజకవర్గ బాధ్యుడు చల్లారం మల్లారెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన కవితకు కృతజ్ఞతలు తెలిపారు. గత బీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగం, వలసలు పెరిగాయని ఆరోపించారు. స్థానిక యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించే పరిశ్రమల ఏర్పాటుపై తగినంత దృష్టి పెట్టలేదని విమర్శించారు. నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధి, చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహం అందించడం ద్వారా యువతకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు.
నిర్వాసితులకు న్యాయం చేయాలి
ప్రాజెక్టుల కోసం భూములు కోల్పోయిన కుటుంబాలకు తగిన పరిహారం, పునరావాసం, ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించాలని లోక రవిచంద్ర డిమాండ్ చేశారు. అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాల ప్రజలకు అందినప్పుడే సామాజిక ప్రగతి సాధ్యమవుతుందన్నారు. ప్రజల సమస్యలను గుర్తించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతోపాటు, పరిష్కారం కోసం ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాటాలు చేపడతామని తెలిపారు. సిద్దిపేటలో నిర్మించనున్న తెలంగాణ రక్షణసేన తొలి జిల్లా కార్యాలయం పార్టీ కార్యకలాపాలకు, ప్రజల నుంచి వినతుల స్వీకరణకు, నాయకులు, కార్యకర్తల సమన్వయానికి కేంద్రంగా ఉంటుందని చెప్పారు. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటామన్నారు. ఈ నెల 30న ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో నిర్వహించనున్న ‘పాంచజన్య సభ’కు పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ నాయకులు శివరాత్రి శ్రీనివాస్, రాజు, అనిల్, ఖాదర్, గౌస్, షేక్ అలీ తదితరులు పాల్గొన్నారు.
లోక రవిచంద్రకు సన్మానం
తెలంగాణ రక్షణ సేన సిద్ధిపేట జిల్లా అధ్యక్షుడిగా నూతనంగా ఎంపికైన లోక రవిచంద్రను ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు శాలువాలతో సత్కరించారు. ఆయనకు అభినందనలు తెలిపి, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా పని చేస్తానని లోక రవిచంద్ర పేర్కొన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ రక్షణ సేన నాయకులు శివరాత్రి శ్రీనివాస్, రాజు, అనిల్, ఖాదర్, గౌస్, షేక్ అలీ తదితరులు పాల్గొన్నారు.





























