ఆరోగ్యం, ఆర్థిక భద్రతపై సిబ్బంది దృష్టి పెట్టాలి.

బెట్టింగ్ యాప్‌లకు దూరంగా ఉండాలి.. సోషల్ మీడియాలో వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దు

జిల్లా అదనపు ఎస్పీ. విక్రాంత్ కుమార్ సింగ్

ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ జూలై 25: పోలీస్ సిబ్బంది ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, సూచించారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన పరేడ్‌కు హాజరైన ఆయన గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల సమయాన్ని తమ ఆరోగ్యం, ఫిట్‌నెస్ కోసం కేటాయించాలని సూచించారు.బెట్టింగ్ యాప్‌లకు పోలీస్ సిబ్బంది పూర్తిగా దూరంగా ఉండాలని, వాటి వల్ల ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సోషల్ మీడియాలో స్టేటస్‌లు పెట్టే సమయంలో వ్యక్తిగత, కుటుంబ, ప్రయాణ వివరాలు వంటి సున్నితమైన సమాచారాన్ని పంచుకోవద్దని సూచించారు. ఇలాంటి సమాచారాన్ని సైబర్ నేరగాళ్లు ఇంపర్సనేషన్ తదితర సైబర్ నేరాలకు దుర్వినియోగం చేసే అవకాశం ఉందని తెలిపారు.

హోంగార్డు సిబ్బందికి కూడా కొన్ని బ్యాంకుల ద్వారా ప్రమాద బీమా ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పోలీస్ శాలరీ ప్యాకేజీలు, బీమా సదుపాయాలను ప్రతి సిబ్బంది సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విధి నిర్వహణలో అనుకోని ప్రమాదం జరిగినప్పుడు కుటుంబ సభ్యులకు ఆర్థిక భరోసా కల్పించడంలో ఈ సదుపాయాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. కుటుంబ సభ్యుడిని కోల్పోయిన లోటును ఎవరూ పూడ్చలేరని, అయితే ఆర్థిక భద్రత ద్వారా వారి కుటుంబానికి అండగా నిలవవచ్చని అన్నారు. కష్టపడి సంపాదించిన ఆదాయంలో కొంత మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్ వంటి సరైన పెట్టుబడి మార్గాల్లో పెట్టుబడి పెట్టుకోవాలని సూచించారు. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ తమ కుటుంబ భవిష్యత్తుకు భద్రత కల్పించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్, సీఐలు మహేష్, కృష్ణమూర్తి, ఆర్ఐ శైలేందర్, ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News