-పది రోజుల పాటు ప్రెస్మీట్లు, ప్రకటనల ప్రచురణకు దూరంగా ఉండాలని నిర్ణయం
ప్రతిపక్షం, గుండాల అక్టోబర్ 29: మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల ఆవరణలో వర్కింగ్ జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళనాన్ని జర్నలిస్టులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని వివిధ పత్రికలు, వార్తా సంస్థల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు పాల్గొని పరస్పరం ఆత్మీయంగా పలకరించుకున్నారు.వృత్తిపరమైన అనుభవాలను పంచుకుంటూ జర్నలిస్టుల ఐక్యత, వృత్తిపరమైన సమస్యలు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు.ఈ సందర్భంగా జర్నలిస్టుల ఐక్యతను చాటుతూ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సరైన సమాచారం లేని వార్తలను, తమకు ఆహ్వానం అందని ప్రెస్మీట్లకు సంబంధించిన వార్తలను ప్రచురించకూడదని నిర్ణయించారు. ఇందులో భాగంగా బుధవారం నుంచి పది రోజులపాటు ఎలాంటి ప్రెస్మీట్ల వార్తలు, ప్రకటనలు ప్రచురించకూడదని స్పష్టం చేశారు.
జర్నలిస్టుల వృత్తిపరమైన గౌరవం, ఐక్యతను కాపాడుకోవడంతోపాటు పరస్పర సహకారంతో ముందుకు సాగాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.సమాజంలో జరుగుతున్న అన్యాయాలను వెలుగులోకి తీసుకురావడం, ప్రజా సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడం, ప్రజలకు వాస్తవ సమాచారాన్ని చేరవేయడంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. నిరంతరం ప్రజా సమస్యలపై పనిచేస్తూ, సమాజ హితం కోసం శ్రమిస్తున్న వర్కింగ్ జర్నలిస్టులను గుర్తించకపోవడం బాధాకరమని అన్నారు.ప్రజల తరఫున నిరంతరం పనిచేసే జర్నలిస్టుల వృత్తిపరమైన సమస్యలను పరిష్కరించేందుకు సంబంధిత వర్గాలు చొరవ చూపాలని అభిప్రాయపడ్డారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా ముందుకు సాగాలని, ప్రెస్ క్లబ్‌లకు అతీతంగా మండల పరిధిలోని వర్కింగ్ జర్నలిస్టులందరూ సోదరభావంతో, పరస్పర సహకారంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. జర్నలిస్టుల మధ్య ఐక్యతను మరింత బలోపేతం చేసుకుంటూ భవిష్యత్తులోనూ ఇలాంటి ఆత్మీయ సమావేశాలు నిర్వహించాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ – గుండాల ఆర్గనైజర్లుగా వెలిశాల నరేష్, తవిడిశెట్టి రాంబాబు, బత్తిని వినయ్, మంకిడి సుధాకర్, చేబోతు రంజిత్ లను ఎన్నుకున్నారు.ఆత్మీయ వాతావరణంలో జరిగిన ఈ సమ్మేళనం జర్నలిస్టుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. వృత్తిపరమైన సమస్యల పరిష్కారంతోపాటు జర్నలిస్టుల ఐక్యత, పరస్పర సహకారమే లక్ష్యంగా ముందుకు సాగాలని ఈ సందర్భంగా నిర్ణయించారు.ఈ కార్యక్రమంలో మలిపెద్ది పవన్, వాంకుడోత్ జగన్ , సల్లూరు సురేష్ , పల్లెర్ల రవి వర్మ , కొంతం నాగార్జున, బొమ్మెర్ల రవి, ఎట్టి సుందర్, పూనెం రమణ బాబు, నర్సింహా రావు, గణేష్, యనగంటి రమేష్ పాల్గొన్నారు.





























