రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డితో పవన్ కుమార్ భేటీ
ప్రతిపక్షం,నంగునూరు, అక్టోబరు 29: తెలంగాణ రాష్ట్రంలో యువజన కాంగ్రెస్ను మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్లో గురువారం సిద్ధిపేట జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, నంగునూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) వైస్ ఛైర్మన్ సాదుల పవన్ కుమార్ ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శివచరణ్ రెడ్డికి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా శివచరణ్ రెడ్డి మాట్లాడుతూ యువజన కాంగ్రెస్ నాయకులకు పదవులు, బాధ్యతలు లభించడం సంతోషకరమని అన్నారు. పార్టీ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించి వాటిని ఎండగట్టాలని పిలుపునిచ్చారు. యువత సమస్యలపై స్పందిస్తూ వారి హక్కుల సాధనకు యువజన కాంగ్రెస్ నాయకులు ముందుండాలని సూచించారు.
నంగునూరు మండలంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్త
పవన్ కుమార్ నంగునూరు మండలంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నిరంతరం కృషి చేస్తానని సాదుల పవన్ కుమార్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి, పార్టీ సిద్ధాంతాలను గ్రామస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేస్తామని పేర్కొన్నారు. యువతను కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షించేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుని పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ పిడిశెట్టి ప్రభాకర్, సిర్రం భాను తదితరులు పాల్గొన్నారు.




























