హైదరాబాద్ టూరిజంపై సీఎం ఫోకస్.. దుర్గం చెరువును అంతర్జాతీయ స్థాయి ఆకర్షణగా తీర్చిదిద్దే దిశగా అడుగులు

ప్రతిపక్షం, జూలై 06: తెలంగాణలో పర్యాటక రంగాన్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో చేపట్టనున్న పర్యాటక అభివృద్ధి ప్రాజెక్టుల పురోగతిపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన సీఎం, హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లోని పర్యాటక కేంద్రాలను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా దుర్గం చెరువును పూర్తి స్థాయి అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సూచించారు.

నగర వారసత్వ సంపదను పరిరక్షిస్తూ పర్యాటకులను ఆకర్షించేలా తారామతి బారాదరీ, పురానాపూల్ హెరిటేజ్ బ్రిడ్జి వంటి చారిత్రక ప్రాంతాలను ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేయాలని సీఎం ఆదేశించారు. అవసరమైతే ట్రాఫిక్‌ను ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించి ఈ ప్రాంతాలను పర్యాటకులకు మరింత అనుకూలంగా మార్చాలని సూచించారు.

వికారాబాద్‌ను రాష్ట్రంలో ప్రముఖ టూరిజం హబ్‌గా అభివృద్ధి చేయాలని, అక్కడి పర్యాటక ప్రాంతాలతో పాటు శ్రీ వీరభద్రస్వామి ఆలయాన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దాలని సీఎం పేర్కొన్నారు. యాదాద్రి తరహాలో ఆలయ అభివృద్ధికి ప్రత్యేక పాలక మండలిని ఏర్పాటు చేసే అంశాన్ని కూడా పరిశీలించాలని అధికారులకు సూచించారు.

భారత్ ఫ్యూచర్ సిటీ పరిధిలోని అటవీ భూముల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో అర్బన్ ఫారెస్ట్‌లు, ఎకో టూరిజం ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలని సీఎం ఆదేశించారు. గుర్రంగూడ ఎకో పార్క్ తరహాలో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కొత్త ఎకో పార్కులను ఏర్పాటు చేసి ప్రకృతి పర్యాటకాన్ని ప్రోత్సహించాలని సూచించారు.

రాష్ట్రంలో పర్యాటక రంగానికి భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు వచ్చే డిసెంబర్‌లో నిర్వహించనున్న గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ ఏర్పాట్లను ఇప్పటి నుంచే ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల మధ్య సమన్వయం కోసం ప్రత్యేక ఉన్నతస్థాయి కమిటీలను ఏర్పాటు చేసి పర్యాటక రంగ అభివృద్ధికి వేగంగా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. హైదరాబాద్‌ను దేశంలోనే ప్రముఖ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

Spread the love

Related News

Latest News