*అనుమతులు ఉన్నాయా..? అక్రమ రవాణా సాగుతోందా..?
*రాత్రి పగలు భారీ లారీలతో మట్టి తరలింపు.. అధికారుల తీరుపై స్థానికుల ఆగ్రహం!
*వేబిల్స్ లేకుండానే మట్టి రవాణా పట్టించుకోని మైనింగ్ అధికారులు..
*అడ్డుకున్న స్థానికులు..
ప్రతిపక్షం, అక్టోబర్ 29, శామీర్ పేట: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని మూడు చింతల లో మట్టి మాఫియా ఆగడాలు చెలరెగిపోతున్నాయి. అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి రవాణా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మూడు చింతలపల్లి రెవెన్యూ పరిధి మీదుగా సిద్దిపేట జిల్లా నుంచి శామీర్‌పేట రెవెన్యూ పరిధిలోని తుర్కపల్లి ప్రాంతంలోని ఫార్మా కంపెనీలకు భారీ ఎత్తున మట్టి తరలిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మైనింగ్ శాఖ అనుమతులు, రవాణాకు సంబంధించిన పత్రాలు లేకుండానే మట్టి దందా సాగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
రాత్రిం బవళ్లు తేడా లేకుండా భారీ లారీలతో మట్టి రవాణా సాగుతోందని, కొన్ని వాహనాలకు నెంబర్ ప్లేట్లు సైతం కనిపించడం లేదని స్థానికులు చెబుతున్నారు. వేబిల్స్ లేకుండానే మట్టి తరలిస్తున్న మైనింగ్ శాఖ అధికారులు అటు రెవెన్యూ శాఖ అధికారులు పట్టించుకోవడంలేదని విమర్శలు వినిపిస్తున్నారు. ఇతర జిల్లాల్లో అనుమతులు తీసుకున్నామంటూ వాహనాలకు స్టిక్కర్లు వేసుకొని, వాటి ఆధారంగా ఇక్కడ యథేచ్ఛగా మట్టి తరలిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వాహనాల రాకపోకలతో రహదారులు దెబ్బతింటున్నాయని, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అధికార యంత్రాంగం నిర్లక్ష్యం
మూడు చింతలపల్లి రెవెన్యూ పరిధిలో మట్టి రవాణా భారీగా జరుగుతున్నప్పటికీ సంబంధిత రెవెన్యూ, మైనింగ్ శాఖ అధికారులు సమర్థవంతమైన చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు. కొందరు మధ్యవర్తుల ప్రమేయంతో ఈ వ్యవహారం సాగుతోందని, అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయకుండా ఉండేందుకు ముడుపులు చెల్లిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
గతంలో ఐదు లక్షల అనుమతులతో కోట్ల రూపాయల దందానా?
గతంలో లాల్గాడి మలక్‌పేటకు చెందిన ఓ బాడా మట్టి వ్యాపారి సుమారు రూ.5 లక్షలతో అనుమతులు తీసుకొని, మట్టి వ్యాపారం ద్వారా దాదాపు రూ.1 కోటి రూపాయల వరకు లాభాలు ఆర్జించాడని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ ఆరోపణల్లో వాస్తవమెంత? అనుమతుల పరిధి ఎంత? వాస్తవంగా ఎంత పరిమాణంలో మట్టి తరలించారు? అనే అంశాలపై సంబంధిత శాఖలు విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం మూడు చింతలపల్లి మీదుగా తుర్కపల్లి ఫార్మా కంపెనీలకు జరుగుతున్న మట్టి రవాణా విలువ నెలకు కోట్ల రూపాయలకు చేరుతోందని స్థానికులు అంచనా వేస్తున్నారు.
ఫార్మా కంపెనీలకు మట్టి సరఫరాపై విచారణ జరగాలి!
మూడు చింతలపల్లి, శామీర్‌పేట రెవెన్యూ పరిధిలోని తుర్కపల్లి ప్రాంతాల్లో జరుగుతున్న మట్టి తవ్వకాలు, రవాణా, వినియోగంపై సమగ్ర విచారణ చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మట్టి తవ్వకాలకు సంబంధించిన అనుమతులు, రవాణా పత్రాలు, వాహనాల నంబర్లు, తరలిస్తున్న మట్టి పరిమాణం, ఫార్మా కంపెనీలకు సరఫరా చేస్తున్న వివరాలను అధికారులు పరిశీలించాలని కోరుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
మట్టి మాఫియా పై ఉన్నతాధికారులు దృష్టి సారించాలి
మూడు చింతలపల్లి మీదుగా సాగుతున్న మట్టి రవాణాపై రెవెన్యూ, మైనింగ్, రవాణా శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు. అనుమతులున్నాయా? లేక అక్రమంగా మట్టి తరలిస్తున్నారా? ఇతర జిల్లాల అనుమతులు ఇక్కడి రవాణాకు వర్తిస్తున్నాయా? నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై చర్యలు తీసుకున్నారా? మట్టి మాఫియా ఆరోపణలపై ఉన్నతాధికారులు దృష్టి సారించి, అక్రమాలు జరిగినట్లు అయితే కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు





























