ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలి

టీఎన్జీవో సిద్దిపేట జిల్లా కార్యవర్గ సమావేశంలో 19 తీర్మానాలు ఏకగ్రీవ ఆమోదం

వేతన సవరణలో 40 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించాలి

పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి

ప్రతిపక్షం ప్రతినిధి, సిద్ధిపేట, అక్టోబరు 29: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూల దృక్పథంతో చొరవ చూపాలని తెలంగాణ నాన్‌ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ యూనియన్‌(టీఎన్జీవో) సిద్దిపేట జిల్లా నాయకులు కోరారు. ఉద్యోగుల సంక్షేమం, వేతన సవరణ, పదోన్నతులు, పెన్షన్‌ విధానం, ఖాళీ పోస్టుల భర్తీ తదితర కీలక అంశాలపై 19 తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. దసరా పండుగను పురస్కరించుకుని అలాయ్‌ బలాయ్‌ కార్యక్రమంతో పాటు జిల్లా కార్యవర్గ సమావేశాన్ని జిల్లా అధ్యక్షుడు గ్యాదరి పరమేశ్వర్‌ అధ్యక్షతన సిద్దిపేటలోని పబ్లిక్‌ సర్వెంట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌లో నిర్వహించారు.

ఉద్యోగుల సేవలు అభినందనీయం

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గ్యాదరి పరమేశ్వర్‌, జిల్లా కార్యదర్శి కోమండ్ల విక్రం రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులందరికీ రాబోయే దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర కీలకమని, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అర్హులైన లబ్ధిదారులకు అందించేందుకు ఉద్యోగులు నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
సిద్దిపేట జిల్లా ఉద్యోగులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో అనేక అవార్డులు, రివార్డులు సాధించి జిల్లాకు గుర్తింపు తీసుకు వస్తున్నారని చెప్పారు. ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రశంసించారు. ఇదే స్ఫూర్తితో మరింత సమర్థంగా విధులు నిర్వహించి సిద్ధిపేట జిల్లాను దేశంలోనే అగ్రగామిగా నిలపాలని పిలుపునిచ్చారు.

40 శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించాలి

ప్రభుత్వానికి, ఉద్యోగులకు తల్లి–కొడుకుల వంటి అనుబంధం ఉండాలని చెప్పారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం సానుభూతితో పరిశీలించి పరిష్కరించాలని నాయకులు కోరారు. వేతన సవరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 40 శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించాలని తీర్మానించినట్లు తెలిపారు. ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యమిస్తూ జిల్లాలోని నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఉద్యోగుల భవిష్యత్తుకు భరోసా కల్పించేలా కంట్రిబ్యూటరీ పెన్షన్‌ పథకం (సీపీఎస్‌)ను రద్దుచేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేసి ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండు విడతల కరువు భత్యం (డీఏ) విడుదలయ్యేందుకు కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క, టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్‌, ప్రధాన కార్యదర్శి ముజీబ్‌ హుస్సేన్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. మిగిలిన ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర నాయకత్వం మరింత చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.

ఉద్యోగుల సమస్యలపై కీలక తీర్మానాలు

సిద్ధిపేట జిల్లాను చార్మినార్‌ జోన్‌లో కలపాలని, రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు టీఎన్జీవో జిల్లా ఎన్నికలు నిర్వహించాలని సమావేశం తీర్మానించింది. జీవో 190 అమలుచేస్తూ జీవో 317 వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరింది. జిల్లా పరిషత్‌లలో ఖాళీగా ఉన్న పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించింది. పంచాయతీ కార్యదర్శులకు గ్రామాల వారీగా గ్రేడింగ్‌ నిర్వహించి పదోన్నతులు కల్పించాలని, వ్యవసాయ శాఖలో క్యాడర్‌ బలాన్ని నిర్ణయించి అవసరమైన కొత్త పోస్టులను మంజూరు చేసి పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని తీర్మానించింది. నీటిపారుదల శాఖలో రాష్ట్రపతి ఉత్తర్వులను అమలుచేస్తూ ఖాళీ పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరింది.
వసతి గృహ సంక్షేమ శాఖ అధికారులకు పదోన్నతులు కల్పించాలని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి వసతి గృహాల ఆహార పట్టికలో మార్పులు చేయాలని సూచించింది. మరణించిన ఉద్యోగి కుటుంబ సభ్యులు కారుణ్య నియామకం వద్దనుకుంటే ఆ కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఈ మేరకు రాష్ట్ర నాయకత్వానికి వినతిపత్రం సమర్పించాలని నిర్ణయించింది.

పని భారం తగ్గించాలి

సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ శాఖను పునర్వ్యవస్థీకరించి అవసరమైన పోస్టులను భర్తీ చేయడం ద్వారా ఉద్యోగులపై పని భారాన్ని తగ్గించాలని కోరారు. ఈ శాఖలో సాంకేతిక వేతన శ్రేణి, అర్హతల సడలింపు, డిప్యూటీ సర్వేయర్ల నియామకాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర నాయకత్వం ద్వారా ప్రభుత్వానికి వినతిపత్రం అందించాలని తీర్మానించారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి టీజీపీఎస్సీ ద్వారా నియమితులైన జూనియర్‌ అసిస్టెంట్లకు కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష ఉత్తీర్ణతకు సంబంధించిన నిబంధన విషయంలో పదోన్నతులకు సమీపంలో ఉన్న ఉద్యోగులకు రెండేళ్ల వెసులుబాటు కల్పించాలని కోరారు. ఉద్యోగుల సేవా పుస్తకాలను అంతర్జాలంలో అందుబాటులోకి తెచ్చే సమయంలో వ్యక్తిగత వివరాల గోప్యతకు భంగం కలగకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని తీర్మానించారు.

పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం

ఉద్యోగులు విధి నిర్వహణతో పాటు పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపుపై ప్రజల్లో అవగాహన కల్పించాలని జిల్లా నాయకులు సూచించారు. ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించి, దాని నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆరోగ్య పరిరక్షణతో పాటు ఆర్థిక క్రమశిక్షణకు ప్రాధాన్యమివ్వాలని, ఉద్యోగులు ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కార్యవర్గానికి జిల్లా ఉద్యోగుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు, వివిధ యూనిట్ల అధ్యక్ష, కార్యదర్శులు, ఫోరమ్‌ అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News