*రైతుల భవిష్యత్ పోరాటాలకు వేదిక కానున్న నల్లగొండ .
*నవంబర్ 15 నుండి 18 వరకు 36వ అఖిల భారత కిసాన్ సభ జాతీయ మహాసభలు
*నవంబర్ 15న లక్ష మందితో ‘చారిత్రక రైతు గర్జన’
*నల్గొండ బహిరంగ సభకు – 28 రాష్ట్రాల నుండి 1,200 మంది ప్రతినిధులు.
*90 ఏళ్ల పోరాట స్ఫూర్తితో కిసాన్ సభ మహాసభలు.
*అఖిల భారత కిసాన్ సభ జాతీయ ప్రధాన కార్యదర్శి విజ్జు కృష్ణన్
ప్రతి పక్షం నల్గొండ అక్టోబర్ 29 : దేశవ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం, రైతు హక్కుల పరిరక్షణ, భవిష్యత్ పోరాటాలకు కార్యాచరణ రూపొందించేందుకు నల్లగొండలో 36వ అఖిల భారత కిసాన్ సభ జాతీయ మహాసభలు నిర్వహించనున్నట్లు ఆ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి విజ్జు కృష్ణన్ ప్రకటించారు.
నవంబర్ 15 నుండి 18 వరకు నాలుగు రోజుల పాటు జరిగే ఈ చారిత్రాత్మక మహాసభలకు సంబంధించిన ఏర్పాట్లను గురువారం ఆయన పరిశీలించారు. రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి తీగల సాగర్, రాష్ట్ర కోశాధికారి మూడో శోభనాయక్, జిల్లా అధ్యక్షుడు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డితో కలిసి నల్గొండలో బహిరంగ సభ స్థలాన్ని పరిశీలించి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.
*ఈ సందర్భంగా విజ్జు కృష్ణన్ మాట్లాడుతూ…
దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 1,200 మందికి పైగా ప్రతినిధులు ఈ మహాసభలకు హాజరుకానున్నారని వెల్లడించారు. అఖిల భారత కిసాన్ సభ 90వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో, చారిత్రాత్మక తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట 90వ వార్షికోత్సవం సందర్భంగా నల్లగొండలో జరుగుతున్న ఈ మహాసభలకు ప్రత్యేక చారిత్రక ప్రాధాన్యత ఉందన్నారు.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్ అనుకూల వ్యవసాయ విధానాలు, రైతు వ్యతిరేక నిర్ణయాలపై ఈ మహాసభల్లో సమగ్రంగా చర్చించి రాబోయే మూడేళ్లకు భవిష్యత్ పోరాటాల కార్యాచరణను రూపొందిస్తామని తెలిపారు. గత మూడున్నరేళ్లలో దేశవ్యాప్తంగా జరిగిన రైతు ఉద్యమాలను, సాధించిన విజయాలను, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యవసాయ విధానాలను సమీక్షించి తదుపరి పోరాటాల దిశను నిర్ణయిస్తామని చెప్పారు.
*నవంబర్ 15న లక్ష మంది రైతులతో భారీ బహిరంగ సభ:
మహాసభల్లో భాగంగా నవంబర్ 15న నల్గొండలో లక్ష మంది రైతులతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ బహిరంగ సభకు మాజీ ఎంపీ బృందా కారత్ ముఖ్య అతిథిగా హాజరవుతారని, అఖిల భారత కిసాన్ సభ జాతీయ అధ్యక్షుడు అశోక్ ధావలే తదితర జాతీయ నాయకులు ప్రసంగిస్తారని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి రైతులు, వ్యవసాయ కార్మికులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ సభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఉడుత రవీందర్, జిల్లా అధ్యక్షుడు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, సయ్యద్ హశం, ఎండీ సలీం, దండంపల్లి సత్తయ్య, నలపరాజు సైదులు, పరిపూర్ణాచారి, భీమగాని గణేష్ తదితరులు పాల్గొన్నారు.





























