పేలుళ్లు ఆపకుంటే బీఆర్‌ఎస్ సమరశంఖం
కట్టకు 200 మీటర్ల దూరంలోనే పేలుళ్లా?
600 మీటర్ల పరిధిలో నిర్మాణాలపై నిబంధనలు ఉన్నా నిర్లక్ష్యమేలా
16 లక్షల ఎకరాల సాగునీటికి ముప్పు తెస్తారా?
రిజర్వాయర్ భద్రతతో చెలగాటమాడితే సహించేది లేదు
మల్లన్న సాగర్ కట్ట వద్ద పేలుళ్లు ఆపకుంటే ప్రత్యక్ష పోరాటం!
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి హరీశ్ రావు అల్టిమేటం
ప్రతిపక్షం ప్రతినిధి , సిద్ధిపేట, అక్టోబరు 29: లక్షల ఎకరాలకు సాగునీరు.. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు తాగునీరు అందించే మల్లన్న సాగర్ భద్రతతో చెలగాటమాడితే సహించేది లేదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు హెచ్చరించారు. రిజర్వాయర్ కట్టకు కేవలం 200 మీటర్ల దూరంలో రాత్రి వేళ భారీ పేలుళ్లు నిర్వహిస్తున్నారని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అనుమతులు, నిపుణుల ఆమోదం లేకుండా పనులు ఎలా చేపడతారు? రిజర్వాయర్‌కు ముప్పు వాటిల్లితే బాధ్యత ఎవరిది? అంటూ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని నిలదీశారు. తక్షణమే పేలుళ్ల నిర్వహణ నిలిపి వేయాలని లేఖ ద్వారా డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ప్రత్యక్ష పోరాటం తప్పదని స్పష్టం చేశారు. గురువారం మల్లన్న సాగర్ పరిశీలించారు. అనంతరం రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు. రిజర్వాయర్ కట్టకు సమీపంలో రాత్రి వేళల్లో భారీ పేలుళ్లు చేపడుతున్నారని ఆరోపించారు. అనుమతులు, నిపుణుల సూచనలు లేకుండా పనులు కొనసాగిస్తే ప్రమాదం తప్పదని హెచ్చరించారు.
కట్టకు 200 మీటర్ల దూరంలోనే పేలుళ్లు!
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా సిద్దిపేట జిల్లా తొగుట, కొండపాక మండలాల సరిహద్దులో మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మించారు. ప్రస్తుతం రిజర్వాయర్ కట్టకు ఆనుకుని అక్రమంగా పేలుళ్లు జరుగుతున్నాయని హరీశ్ రావు తన లేఖలో పేర్కొన్నారు. స్థానికులు ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు.నిబంధనల ప్రకారం కట్టకు 600 మీటర్ల పరిధిలో నిర్మాణాలు చేపట్ట కూడదని పేర్కొన్నారు. ఈ నిబంధనలకు విరుద్ధంగా 200 మీటర్ల లోపే భారీ పేలుళ్లు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. ఈ పనులకు ఎవరు అనుమతిచ్చారు? నిపుణుల అభిప్రాయాలు తీసుకున్నారా? రిజర్వాయర్‌కు ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిది? అని నిలదీశారు.
16 లక్షల ఎకరాల సాగుకు ఆధారం
మల్లన్న సాగర్ కేవలం జలాశయం మాత్రమే కాదు. తెలంగాణ సాగునీటి అవసరాలకు కీలక ఆధారమని హరీశ్ రావు పేర్కొన్నారు. 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ఈ రిజర్వాయర్‌కు 60 మీటర్ల ఎత్తు, 22.6 కిలోమీటర్ల పొడవైన కట్ట ఉందని వివరించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా 1.65 లక్షల ఎకరాలకు, పరోక్షంగా 16 లక్షల ఎకరాలకు పైగా సాగునీరు అందించే అవకాశం ఉందని తెలిపారు. కొండ పోచమ్మ సాగర్, గంధమల్ల, బస్వాపూర్, హల్దీ వాగు, నిజాంసాగర్, సింగూరు, ఘనపూర్ ప్రాజెక్టు, తపాస్‌పల్లి రిజర్వాయర్లకు నీటిని తరలించే కార్యాచరణ తమ ప్రభుత్వ హయాంలో చేపట్టామని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక పనులు నిలిచిపోయాయని విమర్శించారు.
హైదరాబాద్ తాగు నీటికీ కీలకం
2022 ఫిబ్రవరి 23న అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మల్లన్న సాగర్ రిజర్వాయర్‌ను ప్రారంభించారని హరీశ్ రావు గుర్తుచేశారు. సాగునీటితో పాటు హైదరాబాద్ మహా నగరానికి గోదావరి జలాల సరఫరాలోనూ ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. ప్రస్తుతం రిజర్వాయర్‌లో 12.5 టీఎంసీల నీరు ఉందని పేర్కొన్నారు. కట్ట భద్రతకు విఘాతం కలిగితే చుట్టుపక్కల 60 గ్రామాల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రిజర్వాయర్‌కు ఏదైనా నష్టం జరిగితే నీటిపారుదల శాఖ మంత్రిగా ఉత్తమ్ కుమార్‌రెడ్డి బాధ్యత వహిస్తారా? అని ప్రశ్నించారు.
నిపుణుల ఆమోదం తప్పనిసరి
మూసీ నది పునరుజ్జీవం కోసం మల్లన్న సాగర్ సమీపంలో మరో పంప్ హౌస్ నిర్మించి, అక్కడి నుంచి కాళేశ్వరం జలాలను తరలించే ప్రయత్నం జరుగుతున్నట్లు తమకు సమాచారం ఉందని హరీశ్ రావు తెలిపారు. మూసీ పునరుజ్జీవానికి నీటిని వినియోగించడంపై తమకు అభ్యంతరం లేదన్నారు. మల్లన్న సాగర్ కట్టకు హాని కలిగేలా పనులు చేపట్టడాన్ని అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. సంబంధిత నిపుణుల నుంచి రాత పూర్వక ఆమోదం పొందిన తర్వాతే పేలుళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు పనులు నిలిపి వేయాలని కోరారు. ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే పనులను అడ్డుకుంటామని హెచ్చరించారు.
నిర్వాసితులకు న్యాయం చేయాలి
మల్లన్న సాగర్ నిర్వాసితుల సమస్యలను హరీశ్ రావు తన లేఖలో ప్రస్తావించారు. తమ ప్రభుత్వ హయాంలో పునరావాస కాలనీల్లో 90 శాతానికి పైగా సౌకర్యాలు కల్పించామని పేర్కొన్నారు. మిగిలిన వసతుల కోసం నిర్వాసితులు మూడేళ్లుగా ఎదురుచూస్తున్నారని తెలిపారు. కొంత మంది నిర్వాసితులకు పరిహారం, పూర్తి స్థాయి వసతులు కల్పించాలని కోర్టు ఆదేశించినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. గతంలో నిర్వాసితులకు పరిహారం ఇవ్వడాన్ని వ్యతిరేకించి ఎక్కువ పరిహారం కావాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు మరింత మెరుగైన పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం వెంటనే స్పందించాలి
మల్లన్న సాగర్ భద్రత విషయంలో నిర్లక్ష్యానికి తావులేదని హరీశ్ రావు స్పష్టం చేశారు. ప్రజల ప్రయోజనాలు, సాగునీటి అవసరాలు, హైదరాబాద్ తాగునీటి భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. పేలుళ్లు నిలిపి వేసి, నిపుణుల సూచనల మేరకు పనులు కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీఆర్‌ఎస్ ప్రజల తరఫున ప్రత్యక్ష ఆందోళనకు దిగుతుందని హెచ్చరించారు.































