చేర్యాల తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

  • 70 వేల రూపాయల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ తహసీల్దార్

ప్రతిపక్షం చేర్యాల, జూలై 06: సిద్దిపేట జిల్లా చేర్యాల మండల తహశీల్దార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోమవారం ఆకస్మికంగా సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో తహశీల్దార్ దిలీప్ నాయక్ 70 వేల రూపాయల లంచం తీసుకుంటూ పట్టుపడ్డారు. విలేకరుల సమావేశంలో అవినీతి నిరోధక శాఖ సంగారెడ్డి డిఎస్పి సుదర్శన్ తెలిపిన వివరాల ప్రకారం.. గత నెల 28న ఏసీబీకి వచ్చిన ఫిర్యాదు మేరకు చేర్యాల మండలంలోని నాగపురి గ్రామానికి చెందిన సర్వే నంబర్లు 833/బీ, 833/సీ, 833/డీ, 833/ఈ, 834/బీ, 834/సీ, 834/డీ, 834/ఈ పరిధిలోని మొత్తం 30 గుంటల భూమికి సంబంధించిన 11 నాలా కన్వర్షన్ దరఖాస్తులను ప్రాసెస్ చేసి అధికారిక అనుమతులు మంజూరు చేయడానికి తహసీల్దార్ లంచం డిమాండ్ చేసినట్లు తెలిపారు. ఈ దరఖాస్తుల్లో ఇప్పటికే 8 దరఖాస్తులు ప్రాసెస్ చేయగా, మిగిలిన ప్రక్రియ పూర్తి చేయడానికి లక్ష యాభైవేలు ఎమ్మార్వో డిమాండ్ చేయగా చివరకు రూ.70 వేల లంచం కోరడంతో బాధితులు జరిగిన విషయాన్ని ఏసీబీ అధికారులకు తెలపడంతో సోమవారం రోజు పక్కా ప్రణాళికతో ఏసీబీ అధికారులు ఉచ్చుపన్ని, తహసీల్దార్ కార్యాలయంలోనే రూ.70 వేల లంచం స్వీకరిస్తున్న సమయంలో దాడి చేసి పట్టుకున్నారు. అనంతరం ఆయన వద్ద నుంచి లంచం నగదును స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా తన విధులను నిజాయితీగా నిర్వర్తించాల్సిన తహసీల్దార్, అధికారిక పనిని చేయడానికి అక్రమంగా లంచం డిమాండ్ చేసి స్వీకరించడం ద్వారా అవినీతికి పాల్పడినట్లు పేర్కొన్నారు. ఈ కేసులో తహసీల్దార్‌ను అరెస్టు చేసి హైదరాబాద్‌లోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నట్లు అవినీతి నిరోధక శాఖ సంగారెడ్డి డిఎస్పి సుదర్శన్ తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారుడి వివరాలను గోప్యంగా ఉంచినట్లు వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేసినట్లయితే ప్రజలు ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. అలాగే వాట్సాప్ 9440446106, ఫేస్‌బుక్ Telangana ACB, ఎక్స్ (ట్విటర్)లో @TelanganaACB ద్వారా కూడా ఫిర్యాదులు స్వీకరిస్తామని తెలిపారు. ఫిర్యాదుదారుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని స్పష్టం చేశారు. ఈ సోదాలలో అవినీతి నిరోధక శాఖ సంగారెడ్డి డిఎస్పి సుదర్శన్ తోపాటు ఇద్దరు ఎస్ఐలు, పదిమంది అధికారులు పాల్గొన్నట్టు తెలిపారు.

Spread the love

Related News

Latest News