తెలంగాణలో పోలీసు ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం.. సీఎం ఆమోదం తర్వాత భారీ నోటిఫికేషన్ విడుదల

ప్రతిపక్షం, జూలై 09: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు మరో శుభవార్త అందింది. పోలీసు శాఖతో పాటు అగ్నిమాపక, జైళ్ల, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోంది. ఇటీవల ఈ నియామకాలకు ఆర్థిక శాఖ ఆమోదం తెలపడంతో తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను సిద్ధం చేసింది.

అధికారుల సమాచారం ప్రకారం, డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆమోదం కోసం ఇప్పటికే పంపించారు. ముఖ్యమంత్రి నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిన వెంటనే వచ్చే వారంలో అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ నియామక ప్రక్రియలో మొత్తం వేల సంఖ్యలో ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో పోలీసు శాఖలో 5,000 పోస్టులు, అగ్నిమాపక శాఖలో 790 పోస్టులు, జైళ్ల శాఖలో 223 పోస్టులు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్‌పీఎఫ్)లో 1,424 పోస్టులను భర్తీ చేయనున్నట్లు సమాచారం. మొత్తం 7,437 పోస్టులకు నోటిఫికేషన్ వెలువడే అవకాశముంది.

నోటిఫికేషన్ విడుదలైన అనంతరం పోస్టుల వారీగా అర్హతలు, వయోపరిమితి, రిజర్వేషన్లు, ఎంపిక విధానం, దరఖాస్తు ప్రక్రియ, శారీరక దారుఢ్య పరీక్షలు, రాత పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలను టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ అధికారికంగా ప్రకటించనుంది.

భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సిద్ధమవుతుండటంతో పోలీసు ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న వేలాది మంది అభ్యర్థుల్లో ఆసక్తి నెలకొంది. సీఎం ఆమోదం అనంతరం నోటిఫికేషన్ విడుదలపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

Spread the love

Related News

Latest News