కౌన్సిల్ సమావేశానికి మీడియాకు అనుమతి నిరాకరణ

•సమాచారం లేకపోవడంతో వనపర్తి మున్సిపల్ సమావేశానికి చేరుకున్న పలువురు విలేకరులు

ప్రతిపక్షం, జులై 27,వనపర్తి ప్రతినిధి: ప్రజా సమస్యలపై చర్చ జరిగే మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి పాత్రికేయులకు అనుమతి నిరాకరించి వనపర్తి మున్సిపల్ పాలకవర్గం.వనపర్తి మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి మీడియాకు అనుమతి లేదనే విషయాన్ని ముందస్తుగా తెలియజేయకపోవడంతో సమావేశానికి పలువురు విలేకరులు హాజరయ్యారు.కౌన్సిల్ సమావేశంలో మీడియాకు అనుమతి లేదని తెలియడంతో విలేకరులు అధికారులను నిలదీశారు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి మీడియా ప్రతినిధులకు అనుమతి లేదనే విషయాన్ని మున్సిపల్ అధికారులు ముందుగానే తెలియజేయాల్సి ఉందని,వెంటనే అనుమతించాలని పలువురు విలేకరులు డిమాండ్ చేశారు.

అత్యున్నత సభల్లోనే పాత్రికేయులకు అనుమతి ఉండగా, వనపర్తి చైర్ పర్సన్ ఇష్టానుసారంగా “మీడియాకు నో ఎంట్రీ” అని ప్రకటించారు.ప్రభుత్వం నుండి ఎలాంటి సర్క్యులర్ లేకున్నా ఈ నిరంకుశ నిర్ణయం తీసుకున్నారని విమర్శలు వస్తున్నాయి.కౌన్సిల్ ఏజెండాలో తప్పులు, అక్రమాలు ఉన్నందులకే” మీడియాను లోపలికి రానివ్వడం లేదనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రజలకు తెలియాల్సిన నిజాలను దాచిపెట్టేందుకే ఈ కుట్ర అని జర్నలిస్టులు, ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.అంధకారంలో నిర్ణయాలు తీసుకుంటే అవినీతికి ఆజ్యం పోసినట్లేనని..పారదర్శకత లేని పాలన ప్రజలకు ప్రమాదం” అని జర్నలిస్టులు వాపోయారు.కౌన్సిల్ సమావేశాలకు మీడియా హాజరుపై స్పష్టమైన విధానం ఏమిటో మున్సిపల్ అధికారులు వెల్లడించాలని, భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా మీడియా ప్రతినిధులకు ముందుగానే సమాచారం అందించాలని విలేకరులు కోరుతున్నారు.

Spread the love

Related News

Latest News