‘ప్రాణం ఉన్నంత వరకు బీఆర్ఎస్‌లోకి వెళ్లను’.. కవిత సంచలన ప్రకటన.. బీఆర్ఎస్‌పై తీవ్ర విమర్శలు

ప్రతిపక్షం, జూలై 09: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు టీఆర్ఎస్ చీఫ్ కవిత. తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేశారు. తాను మళ్లీ బీఆర్ఎస్‌లోకి వెళ్తానంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని, ఉద్దేశపూర్వకంగా కొందరు ఇలాంటి ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

విలేకరుల సమావేశంలో మాట్లాడిన కవిత, తన రాజకీయ భవిష్యత్తుపై జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. టీఆర్ఎస్ అనే పేరును తనకు దక్కకుండా చేయడానికి కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన ఆమె, ఆ పార్టీలో విలువలు, సిద్ధాంతాలు, క్రమశిక్షణ పూర్తిగా కనుమరుగయ్యాయని ఆరోపించారు. ఒక రాజకీయ పార్టీకి ఉండాల్సిన నీతి, నియమాలు, బాధ్యతాయుతమైన వ్యవహారశైలి బీఆర్ఎస్‌లో కనిపించడం లేదని వ్యాఖ్యానించారు.

సామాజిక మాధ్యమాల్లో బీఆర్ఎస్‌కు చెందిన కొందరు నాయకులు, కార్యకర్తలు వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారని కవిత ఆరోపించారు. మహిళల పట్ల కనీస గౌరవం కూడా లేకుండా తల్లి, చెల్లి అనే సభ్యతను మరిచి అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి రాజకీయ సంస్కృతిని ప్రజలు గమనిస్తున్నారని, వ్యక్తిత్వ హననమే లక్ష్యంగా సోషల్ మీడియాను ఉపయోగించడం బాధాకరమని అన్నారు.

తాను ఎలాంటి ఒత్తిళ్లకు లొంగబోనని, ప్రజల కోసం చేపట్టిన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిస్తానని కవిత స్పష్టం చేశారు. తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని కోరుతూ, రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేని వారే అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.

కవిత చేసిన తాజా వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి చర్చకు దారితీశాయి. ఆమె బీఆర్ఎస్‌తో ఎలాంటి సంబంధం పెట్టుకోబోనని స్పష్టంగా ప్రకటించడంతో రాష్ట్ర రాజకీయాల్లో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకత్వం నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది.

Spread the love

Related News

Latest News