ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర?.. అమెరికాకు ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ హెచ్చరిక!

ప్రతిపక్షం, జూలై 10: ఇరాన్ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నానికి కుట్ర పన్నుతోందనే సంచలన సమాచారాన్ని ఇజ్రాయెల్ అమెరికాకు అందించినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ వారం అమెరికా అధికారులకు ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ వర్గాలు రహస్య హెచ్చరిక జారీ చేశాయని ప్రముఖ మీడియా సంస్థ సీఎన్‌ఎన్ వెల్లడించింది. అయితే ఈ సమాచారం ఒక నిర్దిష్ట దాడికి సంబంధించినదేనని పేర్కొన్నప్పటికీ, దాడి ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరిగే అవకాశం ఉందనే పూర్తి వివరాలను వెల్లడించలేదు.

అయితే ఈ ఇంటెలిజెన్స్ నివేదిక వెనుక మరో కోణం కూడా ఉన్నట్లు అమెరికా అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఇరాన్‌పై అమెరికా మరింత కఠిన చర్యలు తీసుకునేలా ట్రంప్‌ను ప్రేరేపించడానికే ఇజ్రాయెల్ ఈ హెచ్చరికను ఉపయోగించి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వైట్ హౌస్ అధికారులు అందిన సమాచారాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇటీవలే ట్రంప్ కూడా తన ప్రాణాలకు ఇరాన్ నుంచి ముప్పు ఉందని బహిరంగంగా వ్యాఖ్యానించారు. తనపై దాడికి ఇరాన్ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించడం గమనార్హం. ట్రంప్ వ్యాఖ్యలు, ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఒకే సమయంలో వెలుగులోకి రావడంతో ఈ అంశం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య ఇప్పటికే తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ ఈ తాజా పరిణామం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. మధ్యప్రాచ్యంలో భద్రతా పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారే అవకాశాలపై విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఆరోపణలపై ఇరాన్ నుంచి ఇప్పటివరకు అధికారిక స్పందన వెలువడలేదు. దీంతో ఈ వ్యవహారంపై మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది.

Spread the love

Related News

Latest News