దళితులపై దాడుల నివారణకు పౌర హక్కుల దినోత్సవం నిర్వహించాలి

నర్సాపూర్ ఆర్డీవోకు ప్రజాసంఘాల నాయకుల వినతి

ప్రతిపక్షం ప్రతినిధి, మెదక్ (నర్సాపూర్) అక్టోబర్ 30: జిల్లాలో దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రతినెలా పౌర హక్కుల దినోత్సవం నిర్వహించాలని ప్రజాసంఘాల నాయకులు నర్సాపూర్ ఆర్డీవో రామకృష్ణను కోరారు. శుక్రవారం ఆర్డీవోను కలిసి వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి. శంకర్, మాల కోఆర్డినేషన్ ఫోరం మెదక్ జిల్లా ఇన్‌చార్జి కల్లూరి సంజీవ, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు, కేవీపీఎస్ జిల్లా కమిటీ సభ్యుడు నాగరాజు, ఎంసీఎఫ్ జిల్లా నాయకులు యు. శివ, నరేందర్ మాట్లాడుతూ.. నర్సాపూర్ డివిజన్ శివంపేట మండలం నవాబుపేట గ్రామంలో బతుకమ్మ పండుగ సందర్భంగా దళితులపై దాడులకు పాల్పడిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

జిల్లాలో వరుసగా జరుగుతున్న దళితులపై దాడులను అరికట్టేందుకు జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫారసుల ప్రకారం ప్రతినెలా చివరి రోజున ఒక గ్రామంలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహించాలని కోరారు. కులవివక్ష, రాజ్యాంగ హక్కులు, చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించి కులమత భేదాలు లేకుండా సోదరభావంతో జీవించేలా చైతన్యం తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమాన్ని నామమాత్రంగా కాకుండా ప్రణాళికాబద్ధంగా నిర్వహించి ప్రజలందరూ పాల్గొనేలా చూడాలని, మండల తహసీల్దార్లు, ఎస్సైలు విధిగా హాజరయ్యేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఇందుకు ఆర్డీవో సానుకూలంగా స్పందించినట్లు నాయకులు తెలిపారు.

గిరిజన భూ నిర్వాసితులకు పునరావాసం కల్పించాలి

ట్రిపుల్ ఆర్ రోడ్డు నిర్మాణం, కాళేశ్వరం ప్రాజెక్టు కారణంగా రెండుసార్లు భూములు కోల్పోతున్న గిరిజన భూ నిర్వాసితులకు భూసేకరణ చట్టం-2013 ప్రకారం న్యాయం చేయాలని ప్రజాసంఘాల నాయకులు ఆర్డీవోను కోరారు. నిర్వాసితులకు భూమికి భూమి ఇవ్వడంతో పాటు మార్కెట్ ధరకు మూడింతల నష్టపరిహారం చెల్లించాలని, అర్హులకు ఉద్యోగాలు కల్పించి పునరావాసం కల్పించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.

మాలల రోస్టర్ పాయింట్లను సవరించాలి

విద్యా, ఉద్యోగ రంగాల్లో మాల విద్యార్థులు, నిరుద్యోగులకు అన్యాయం జరుగుతోందని మాల కోఆర్డినేషన్ ఫోరం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. మాలల రోస్టర్ పాయింట్ 22ను పది లోపు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పి. శంకర్, కల్లూరి సంజీవ మాట్లాడుతూ.. ప్రస్తుత రోస్టర్ విధానం వల్ల మాల విద్యార్థులు, నిరుద్యోగులకు విద్యా, ఉద్యోగ అవకాశాల్లో తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. ప్రభుత్వం వెంటనే రోస్టర్ పాయింట్లను సవరించాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎంసీఎఫ్ జిల్లా నాయకులు యు. శివ తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News