ప్రభుత్వ కళాశాలలో విద్యార్థినులకు యూనిఫాంల పంపిణీ!
ప్రభుత్వ విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్య..
ప్రైవేటుకు దీటుగా బోధన
విద్యార్థులు అవకాశాలను అందిపుచ్చుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలి
- శివకోటి, ప్రిన్సిపాల్
ప్రతిపక్షం, నంగునూరు, అక్టోబరు 30: విద్యార్థుల్లో సమానత్వ భావనను పెంపొందిస్తూ, క్రమశిక్షణకు ప్రతీకగా నిలిచేలా నంగునూరు ప్రభుత్వ కళాశాలలో శుక్రవారం విద్యార్థినులకు ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు. విద్యతో పాటు విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి ప్రాధాన్యమిస్తూ చేపట్టిన ఈ కార్యక్రమం విద్యార్థినుల్లో ఆనందాన్ని నింపింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ శివకోటి మాట్లాడుతూ.. ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతోపాటు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రైవేటు కళాశాలలకు దీటుగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్యాబోధన కొనసాగుతోందని పేర్కొన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో అందుబాటులో ఉన్న విద్యా సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఏకరూప దుస్తులు విద్యార్థుల మధ్య సమానత్వ భావనను పెంపొందిస్తాయని, క్రమశిక్షణకు దోహద పడతాయని తెలిపారు.
విద్యార్థులందరిలో ఆత్మవిశ్వాసం, ఐక్యతా భావం పెంపొందించడంలో ఇలాంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. విద్యార్థులు చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని చెప్పారు. కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని పిలుపునిచ్చారు. తల్లిదండ్రులు తమపై పెట్టుకున్న ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చేలా పట్టుదలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ కళాశాలల్లో లభిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకొని ఉన్నత విద్యను అభ్యసించి భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకొని తల్లిదండ్రులకు, కళాశాలకు మంచి పేరు తీసుకు రావాలని ప్రిన్సిపాల్ శివకోటి విద్యార్థినులకు సూచించారు.





























