*ప్రజల ఆరోగ్యమే ప్రథమ ప్రాధాన్యం – నాణ్యతలో రాజీ పడేది లేదు.
*చికెన్ షాపులు, సూపర్ మార్కెట్లు, రెస్టారెంట్లలో ఆకస్మిక సోదాలు.
*పరిశుభ్రత లోపిస్తే ఉపేక్షించేది లేదు – యజమానులకు కమీషనర్ కఠిన హెచ్చరిక.
*రేపు కిరణా మర్చంట్ అసోసియేషన్తో ‘సింగిల్ యూజ్ ప్లాస్టిక్’ పై అవగాహన సదస్సు
*చండూరు మున్సిపల్ కమిషనర్ ఎల్. మల్లేశం.
ప్రతి పక్షం చండూరు, అక్టోబర్ 30: చండూరు పట్టణ ప్రజల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా మున్సిపల్ యంత్రాంగం కదిలింది. పట్టణ ప్రజలకు పరిశుభ్రమైన, సురక్షితమైన, నాణ్యమైన ఆహార పదార్థాలను అందించడంతో పాటు పారిశుద్ధ్య ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయాలనే సంకల్పంతో మున్సిపల్ కమిషనర్ శ్రీ ఎల్. మల్లేశం గారి ఆధ్వర్యంలో అధికారులు పట్టణంలోని పలు చికెన్ షాపులు, సూపర్ మార్కెట్లు, రెస్టారెంట్లలో శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
ఈ సోదాల్లో భాగంగా చికెన్ షాపుల్లో మాంసం నిల్వ చేసే విధానం, దుకాణాల పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణను అధికారులు పరిశీలించారు. అలాగే సూపర్ మార్కెట్లలో ఆహార పదార్థాల గడువు తేదీలు (Expiry Dates), ప్యాకింగ్ విధానం, రెస్టారెంట్లలో వంటశాలల (Kitchens) పరిశుభ్రత, తాగునీటి సౌకర్యాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
ఈ తనిఖీల్లో పలు వ్యాపార సంస్థలు నాణ్యతా ప్రమాణాలు, పరిశుభ్రతను పాటించడం లేదని గుర్తించిన అధికారులు, నిబంధనలు ఉల్లంఘించిన సంబంధిత యాజమాన్యాలపై మొత్తం రూ.10,000/- జరిమానా విధించారు.
కమిషనర్ హెచ్చరికలు:
ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ఎల్. మల్లేశం గారు మాట్లాడుతూ… “ప్రజల ఆరోగ్యానికి మున్సిపాలిటీ అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. వ్యాపార సంస్థలు తప్పనిసరిగా పరిశుభ్రత పాటించాలి. తాజా, నాణ్యమైన ఆహార పదార్థాలనే విక్రయించాలి. గడువు ముగిసిన సరుకులను విక్రయిస్తే కఠిన చర్యలు ఉంటాయి. దుకాణాల పరిసరాల్లో వ్యర్థాలు పేరుకుపోకుండా చూసుకోవాలి” అని ఆదేశించారు.ప్రభుత్వం నిషేధించిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను వాడొద్దని, వాటి స్థానంలో పర్యావరణహిత ప్రత్యామ్నాయాలను ఉపయోగించాలని ఆయన సూచించారు. భవిష్యత్తులోనూ ఇలాంటి ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని, నిబంధనలు పాటించని వారిపై మరింత కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ క్రమంలోనే ప్లాస్టిక్ రహిత పట్టణంగా చండూరును మార్చేందుకు రేపు (శనివారం) కిరణా మర్చంట్ అసోసియేషన్ ప్రతినిధులతో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.
చండూరు పట్టణాన్ని పరిశుభ్రమైన, ఆరోగ్యవంతమైన, ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రజలంతా సహకరించాలని, కేవలం పరిశుభ్రత పాటించే దుకాణాలనే ప్రోత్సహించాలని మున్సిపల్ అధికారులు విజ్ఞప్తి చేశారు.
ఈ ఆకస్మిక తనిఖీలలో మున్సిపల్ మేనేజర్ జి. రాములు, వార్డు ఆఫీసర్ జి. శ్రీరాములు, పర్యావరణ ఇంజనీర్ యం. అరవింద్ రెడ్డి, బిల్ కలెక్టర్లు జి. మహేష్, జి. రమేష్ తదితరులు పాల్గొన్నారు.































