అక్రమ కోళ్ల ఫారాల నిర్మాణం పై ప్రశ్నిస్తే కేసులతో వేధింపులా? – దామర భీమనపల్లిలో కలకలం.

*గ్రామపంచాయతీ అనుమతులు లేకుండానే రెండు కోళ్ల షెడ్ల నిర్మాణం – గ్రామస్థుల ఆరోపణ.

*ప్రశ్నించిన ఆరుగురు గ్రామస్థులపై అక్రమ కేసులు – నజరాణాలకు ప్రలోభం, బెదిరింపులు.

*కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు – చివరకు హైకోర్టును ఆశ్రయించిన బాధితులు.

ప్రతిపక్షం – మర్రిగూడ అక్టోబర్ 30 : మర్రిగూడ మండలం దామర భీమనపల్లి గ్రామపంచాయతీ పరిధిలో అక్రమ కోళ్ల ఫారాల నిర్మాణం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గ్రామంలో అక్రమంగా కోళ్ల ఫారాల నిర్మాణం చేపట్టి, వాటిపై ప్రశ్నిస్తున్న గ్రామస్థులను ప్రలోభాలకు గురిచేయడం, బెదిరింపులకు పాల్పడడం, పోలీస్ స్టేషన్‌లో అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారనే ఆరోపణలు కలకలం లేపుతున్నాయి.
గ్రామపంచాయతీ నుంచి ఎలాంటి నిర్మాణ అనుమతులు పొందకుండానే, కేవలం ఎన్‌ఓసీ ఆధారంగా రెండు కోళ్ల ఫారం షెడ్ల నిర్మాణం పూర్తి చేసి నిర్వహిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. సంబంధిత శాఖల నిబంధనలు పాటించకుండా నిర్మాణాలు చేపట్టడంపై గ్రామప్రజలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. డబ్బు, రాజకీయ పలుకుబడి, అండదండలు ఉన్నాయనే అహంకారంతో ఫారం యజమాని వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

*ప్రశ్నించిన వారిపై కేసులా?

గ్రామంలో అక్రమ కోళ్ల షెడ్ల నిర్మాణాన్ని నిలుపుదల చేయాలని గ్రామానికి చెందిన కర్నాటి వెంకటయ్య, కాకులవరం రాఘవరెడ్డి, అచ్చిని సైదులుతో పాటు మొత్తం ఆరుగురు గ్రామప్రజలు ప్రశ్నించారు. వారికి నజరాణాలు ఇచ్చేందుకు ప్రయత్నించారని, వాటిని తిరస్కరించడంతో వారిపై అక్రమ కేసులు నమోదు చేయించి వేధింపులకు గురిచేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. తమ భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ గ్రామ ప్రజలపై కోర్టులో తప్పుడు ఆరోపణలు చేస్తూ కేసులు వేస్తున్నారని పేర్కొంటున్నారు.

*హైకోర్టును ఆశ్రయించిన బాధితులు..

కోళ్ల ఫారం నిర్మాణంపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన గ్రామస్థులు గతంలో జిల్లా కలెక్టర్‌తో పాటు సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. దీంతో బాధితులు హైకోర్టును ఆశ్రయించి యజమానిపై కేసు వేసిన నేపథ్యంలో, తమపై ప్రతీకార చర్యగా అధికారుల సహకారంతో అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

*ఉన్నతాధికారులు స్పందించాలి..

గ్రామపంచాయతీ అనుమతులు, ఎన్‌ఓసీ వివరాలు, సంబంధిత శాఖల అనుమతులపై సమగ్ర విచారణ జరిపించాలని, అక్రమ నిర్మాణాలు నిజమైతే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, గ్రామస్థులపై నమోదైన కేసుల పూర్వాపరాలను పరిశీలించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్, పోలీసు ఉన్నతాధికారులు, పంచాయతీరాజ్ శాఖ అధికారులు నిష్పక్షపాత విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Spread the love

Related News

Latest News