గుడి భూములు గుటకాయ స్వాహా

వెంకన్న భూములకు రెక్కలొచ్చాయా?

ఐదు ఎకరాల్లో మిగిలింది ఒక్క ఎకరమే!

నాలుగు ఎకరాలు వ్యక్తుల పరం!

వెంకన్న భూముల మాయంపై సమగ్ర విచారణ జరిపించాలి

సిద్దిపేట వెంకటేశ్వర స్వామి ఆలయ ఉద్యానవన స్థలం అన్యాక్రాంతంపై ఆరోపణలు

అసైన్డ్ భూమి వ్యక్తుల పేర్లపైకి ఎలా మారింది?

రికార్డులు బయట పెట్టాలి

సీఎం రేవంత్‌రెడ్డికి శ్రీనివాస సేవా సమితి, దేవాలయ ఆస్తుల పరిరక్షణ సమితి నాయకుల విజ్ఞప్తి

ప్రతిపక్షం ప్రతినిధి, సిద్ధిపేట అక్టోబరు 30: భక్తుల భక్తికి ప్రతీకగా నిలిచిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి కేటాయించిన ఐదు ఎకరాల భూమిలో నాలుగు ఎకరాలు అన్యాక్రాంతం అయ్యాయన్న ఆరోపణలు సిద్ధిపేటలో కలకలం రేపుతున్నాయి. ఆలయ అవసరాల కోసం కేటాయించిన భూమి వ్యక్తుల చేతుల్లోకి ఎలా వెళ్లిందనే అంశంపై సమగ్ర విచారణ జరిపించాలని శ్రీనివాస సేవా సమితి, దేవాలయ ఆస్తుల పరిరక్షణ సమితి నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆలయ భూముల బదలాయింపు వెనుక ఉన్న వాస్తవాలను వెలికి తీయాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. సిద్ధిపేట ప్రెస్ క్లబ్‌లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో శ్రీనివాస సేవా సమితి అధ్యక్షుడు జిల్లా శ్రీనివాస్, దేవాలయ ఆస్తుల పరిరక్షణ సమితి నాయకుడు ఉడుత మల్లేశం యాదవ్ మాట్లాడారు. సిద్దిపేటలోని బ్లాక్ ఆఫీస్ సమీపంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం కోసం ఐదు ఎకరాల భూమిని గతంలో కేటాయించినట్లు తెలిపారు. అప్పటి ఎమ్మెల్యే అనంతుల మదన్‌ మోహన్ సూచనల మేరకు అప్పటి ఆర్డీవో వెంకట నరసయ్య ఐదు ఎకరాల అసైన్డ్ భూమిని ఆలయానికి కేటాయించారని చెప్పారు.

భక్తుల సహకారంతో ఆలయ నిర్మాణం.. భూమి అన్యాక్రాంతం!

సిద్ధిపేట ప్రజలు, భక్తులు, దాతల సహకారంతోనే వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం జరిగిందని నాయకులు గుర్తు చేశారు. ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్మించిన ఆలయానికి కేటాయించిన ఐదు ఎకరాల భూమి కేవలం ఏడాది పాటు మాత్రమే ఆలయం పేరుతో కొనసాగిందని తెలిపారు. అనంతరం ఆ భూమిని వ్యక్తిగతంగా తమ కుమారుల పేర్లకు మార్చుకున్నారని పేర్కొన్నారు. చివరకు ఆలయానికి కేవలం ఒక ఎకరం భూమి మాత్రమే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. భక్తుల కోసం, ఆలయ అభివృద్ధి కోసం కేటాయించిన భూమి వ్యక్తుల పేర్లకు ఎలా మారిందో అధికార యంత్రాంగం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆలయ ఆస్తుల పరిరక్షణలో జరిగినట్లు ఆరోపిస్తున్న ఈ పరిణామాలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహించ కూడదని స్పష్టం చేశారు.

అసైన్డ్ భూమి రిజిస్ట్రేషన్ ఎలా జరిగింది?

అసైన్డ్ భూమికి సంబంధించిన రికార్డులు ఎలా మారాయి? అసైన్డ్ భూమిని ఏ నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ చేశారు? ఐదు ఎకరాల భూమిలో నాలుగు ఎకరాలు ఎవరి పేర్లపైకి వెళ్లాయి? భూమి బదలాయింపునకు అనుమతులు ఎవరు ఇచ్చారు? ఈ వ్యవహారంలో అధికారుల పాత్ర ఏమిటి? అనే ప్రశ్నలను నాయకులు లేవనెత్తారు. భూమికి సంబంధించిన అసలు కేటాయింపు పత్రాలు, రెవెన్యూ రికార్డులు, రిజిస్ట్రేషన్ పత్రాలు, ఇతర అధికారిక దస్త్రాలను సమగ్రంగా పరిశీలించాలని కోరారు. భూ బదలాయింపు ప్రక్రియలో నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఆలయ ఆస్తుల పరిరక్షణకు కలిసి రావాలి

దేవాలయాలకు చెందిన భూములు, ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నాయన్న ఆరోపణలపై ప్రజలు, భక్తులు ప్రశ్నించాల్సిన అవసరం ఉందని నాయకులు అన్నారు. ఆలయ ఆస్తులను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ విషయంలో సిద్ధిపేటకు చెందిన అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, భక్తులు తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఈ వ్యవహారంపై ప్రత్యేక దృష్టి సారించి ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించాలని కోరారు. ఆలయానికి కేటాయించిన ఐదు ఎకరాల భూమి వివరాలను బహిర్గతం చేయడంతో పాటు, ఆలయానికి చెందాల్సిన భూమిని తిరిగి పరి రక్షించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో దేవాలయ ఆస్తుల పరిరక్షణ సమితి నాయకులు సత్యం, వేణుతో పాటు పలువురు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News