నవంబర్ 26, 27, 28 తేదీల్లో టీ-హబ్‌లో మూడు రోజుల పాటు నిర్వహణ
సైబరాబాద్, ప్రతిపక్షం,అక్టోబర్ 30: సమాచార సాంకేతిక రంగం (ఐటీ), ఐటీ ఆధారిత సేవలు, గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు (జీసీసీలు), ఫార్మాస్యూటికల్ రంగాలకు ప్రముఖ కేంద్రంగా సైబరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. నగరంలో పెరుగుతున్న ఉద్యోగ అవకాశాలు, నివాస ప్రాంతాలు, ఆర్థిక కార్యకలాపాలకు అనుగుణంగా మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించడం అత్యంత కీలకంగా మారింది.
ఈ నేపథ్యంలో సురక్షితమైన, అందరికీ అందుబాటులో ఉండే, పర్యావరణహిత రవాణా వ్యవస్థ రూపకల్పనపై చర్చించేందుకు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ పోలీస్, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (SCSC), షిఫ్ట్ ట్రాన్స్పోర్ట్ ఇనిషియేటివ్ సంయుక్తంగా ‘సైబరాబాద్ మూవ్స్ 2026’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నాయి.
నవంబర్ 26 నుంచి 28 వరకు మూడు రోజుల పాటు సైబరాబాద్‌లోని టీ-హబ్‌లో ఈ ప్రత్యేక ప్రదర్శన, చర్చా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా పాఠశాలలు, కళాశాలల విద్యార్థుల కోసం మొబిలిటీ ఇన్నోవేషన్ ఛాలెంజ్ కూడా ప్రారంభించారు.
రవాణా వ్యవస్థలో ప్రజల భద్రతకు ప్రాధాన్యం: సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేశ్, ఐపీఎస్
ఈ కార్యక్రమానికి సంబంధించి శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేశ్, ఐపీఎస్ మాట్లాడుతూ, “నగరం విస్తరిస్తున్న కొద్దీ రవాణా వ్యవస్థ కేవలం ట్రాఫిక్ నియంత్రణకే పరిమితం కాకుండా, ప్రతి ఒక్కరూ సురక్షితంగా, సులభంగా తమ గమ్యస్థానాలకు చేరుకునేలా ఉండాలి. ‘సైబరాబాద్ మూవ్స్’ కార్యక్రమం వివిధ వర్గాల అభిప్రాయాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చే వినూత్న ప్రయత్నం. ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని, మెరుగైన సైబరాబాద్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరుతున్నాం” అని తెలిపారు.
మెరుగైన రవాణా వ్యవస్థ కోసం సమిష్టి కృషి అవసరం: సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ జి. సృజన, ఐఏఎస్
సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ జి. సృజన, ఐఏఎస్ మాట్లాడుతూ, సైబరాబాద్ అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత తరుణంలో నగరంలో ప్రజల రాకపోకల విధానాన్ని పునరాలోచించడానికి మంచి అవకాశం ఏర్పడింది. వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం కోసం ‘సైబరాబాద్ కన్వర్జెన్స్’ వేదికగా పనిచేస్తోంది. ముఖ్యంగా విద్యార్థులు మొబిలిటీ ఇన్నోవేషన్ ఛాలెంజ్‌లో పాల్గొని తమ వినూత్న ఆలోచనలను పంచుకోవాలని కోరుతున్నాం” అని తెలిపారు.
ఈ విలేకరుల సమావేశంలో టీజీఎస్ఆర్టీసీ, హెచ్ఎండీఏ, హుమ్టా (HUMTA), రవాణా శాఖ, ఓపెన్ డేటా తెలంగాణ ప్రతినిధులు పాల్గొన్నారు.





























