కేశంపేట మండల కేంద్రంలో వేధిస్తున్న మరుగుదొడ్ల సమస్య..
ప్రతిపక్షం, షాద్ నగర్, మే 21: అటు ఉద్యోగాల్లో.. ఇటు వ్యాపారాల్లో మగవారితో సమానంగా అన్ని రంగాల్లో అడుగులు వేస్తున్న మహిళలు పలు సందర్భాల్లో ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, వ్యాపార కేంద్రాలకు పలు అవసరాల నిమిత్తం మండల కేంద్రానికి వచ్చే ఆడపడుచులకు ప్రజా మరుగుదొడ్లు అందుబాటులో లేకపోవడం ఇబ్బందులకు కారణమవుతోంది. అన్నిరకాలుగా అభివృద్ది చెందుతున్న మండల కేంద్రంలో అవసరానికి ఆ ఒక్కటి కనిపించకపోవడంతో ఎటూ పాలుపోక తిట్టుకుంటూ గ్రామాలకు తిరుగుప్రయాణం కొనసాగిస్తున్నారు.
మండలంలో పరిస్థితి దారుణం..
షాద్ నగర్ నియోజకవర్గ పరిధిలోని కేశంపేట మండల కేంద్రంకు ప్రతినిత్యం అనేక పనుల నిమిత్తం ఎంతో మంది వస్తుంటారు. గ్రామాల్లో పనిచేసే ఉద్యోగులు, మహిళా సంఘాల సభ్యులు, వ్యాపారులు, అవసరాల నిమిత్తం అడపాదడపా మండలకేం ద్రంలో ఉన్న బ్యాంకులకు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు రాకపోకలు కొన సాగిస్తుంటారు. మరోపక్క రాష్ట్రప్రభుత్వం ప్రతి మండలకేంద్రంలోని రెవిన్యూ కార్యాలయంలను సబ్ రిజస్ట్రార్ కార్యాలయం లుగా మార్చి రిజిస్ట్రేషన్ లు కొన సాగిస్తోంది. మరో పక్క మండలకేంద్రంలో నిర్వహించే వారాంతపు సంతలకు గ్రామాల నుంచి ప్రజలు వచ్చి క్రయవిక్రయాలు నిర్వహిస్తుంటారు. దాంతో గంటల తరబడి అక్కడే ఉండాల్సి ఉంటుంది. మండలకేంద్రంలో ఎక్కడా ప్రజా మరుగుదొడ్లను అధికారులు ఏర్పాటు చేయలేదు.
రిజిస్ట్రేషన్ లకోసం ఎంతో మంది ప్రతినిత్యం వస్తున్న టాయిలెట్స్, మరుగుదొడ్లు మాత్రం లేవు. దీంతో ప్రజలకు కనీససౌకర్యాలు కల్పించాలని, మరుగుదొడ్లు లేకపోవడం బాధాకరమని విమర్శిస్తున్నారు. కేశంపేట మండలంలో దాదాపు 21,715 మంది పురు షులు,20,877 మంది స్త్రీలు వున్నారు.గతంలో ఉపాధిహామీ పథకం కింద మండల కేంద్రాలు, గ్రామాల్లో ప్రజామరుగుదొడ్ల ఏర్పాటుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా ఎక్కడా సర్పంచులు, అధికారులు నిర్మాణాలకు ముందుకు రాలేదు. దీంతో ప్రజామరుగుదొడ్ల ఏర్పాటు కలగానే మిగిలిపోయింది. మండల కేంద్రంలో పరిస్థితి మరీ దారుణంగా ఉందంటున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకొని మండలకేంద్రంలో ప్రజామరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.