ప్రతిపక్షం ప్రతినిధి,మెదక్, అక్టోబర్ 31: భారతదేశ ఐక్యత, సమగ్రతకు విశేష కృషి చేసిన ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గడ్డం కాశీనాథ్ పిలుపునిచ్చారు.సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా మెదక్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో శనివారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గడ్డం కాశీనాథ్ మాట్లాడుతూ.. 1875 అక్టోబర్ 31న గుజరాత్‌లోని నడియాడ్‌లో జన్మించిన పటేల్, ఉన్నత విద్యను అభ్యసించినప్పటికీ దేశ స్వాతంత్ర్యం కోసం ఉద్యమాల్లో పాల్గొన్నారని తెలిపారు.
బార్డోలీ సత్యాగ్రహం, రైతు ఉద్యమాల ద్వారా ప్రజల్లో విశేష గుర్తింపు పొందారని, రైతుల సంక్షేమం కోసం పోరాడిన మహానీయుడని కొనియాడారు. స్వాతంత్ర్యం అనంతరం దేశంలోని 560కి పైగా సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడంలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయడంలోనూ ఆయన ధైర్యసాహసాలు, దృఢ సంకల్పం చరిత్రలో నిలిచిపోయాయని అన్నారు.దేశంలో ఐఏఎస్, ఐపీఎస్ వంటి అఖిల భారత సర్వీసుల వ్యవస్థకు పటిష్టమైన పునాది వేసిన దార్శనికుడు పటేల్ అని కొనియాడారు. భారత ఉప ప్రధానిగా, తొలి హోంమంత్రిగా దేశ ఐక్యత, సార్వభౌమత్వ పరిరక్షణకు ఎనలేని సేవలందించారని తెలిపారు. కేవలం 40 నెలల పదవీకాలంలోనే దేశ భవిష్యత్తుకు బలమైన పునాదులు వేసిన భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలు చిరస్మరణీయమని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లాల విజయ్, ఎంఎల్ఎన్ రెడ్డి, పబ్బ లక్ష్మణ్, బజ్జూరు బిక్షపతి, గోవిందరాజ్, అల్లం మధు, వేణు, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.





























