*చెట్టును ఢీకొని బోల్తాపడ్డ గూడ్స్ వాహనం, ఆవు మృతి.
*విద్యుత్ స్తంభాన్ని , చెట్టును ఢీకొని నుజ్జునుజ్జు అయిన వాహనం.
*విరిగిపడ్డ కరెంటు స్తంభం – తృటిలో తప్పిన పెను ప్రమాదం.
ప్రతిపక్షం – చండూరు, అక్టోబర్ 31: చండూరు మండలం ఉడుతల పల్లి గ్రామ శివారులో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా దూసుకువచ్చిన గూడ్స్ వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొని బోల్తాపడింది.వాహనం వేగంగా వచ్చి ముందుగా విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి, ఆ తర్వాత చెట్టును ఢీకొంది. ఢీకొన్న వేగ ధాటికి వాహనం ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయి చెట్టుకు ఇరుక్కుపోయింది. వాహనం తలకిందులుగా పడిపోవడంతో విద్యుత్ స్తంభం విరిగి రోడ్డుపై పడింది.ఈ ప్రమాదంలో ఒక ఆవు అక్కడికక్కడే మృతి చెందింది.డ్రైవర్ కు తీవ్ర గాయాలైనట్లు ప్రాథమిక సమాచారం. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.స్థానికులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు.
































