దళితులపై దాడులు చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి

సర్పంచ్ మన్నే కళ్యాణ్‌ను పదవి నుంచి తొలగించాలి.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణ అధికారిని మార్చాలి

నవంబర్ 3న తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నాలు.. 11, 12 తేదీల్లో కలెక్టరేట్ ఎదుట 48 గంటల నిరాహార దీక్షలు

ప్రతిపక్షం ప్రతినిధి,మెదక్, అక్టోబర్ 31: మెదక్ జిల్లాలో దళితులపై వరుసగా జరుగుతున్న దాడులను నిరసిస్తూ, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ KVPS, DBF ప్రజాసంఘాల ఆధ్వర్యంలో శనివారం మెదక్ పట్టణంలోని కేవల్ కిషన్ భవన్‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో కోనాయపల్లి గ్రామంలో దళితులపై దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సర్పంచ్ మన్నే కళ్యాణ్, ఆయన అనుచరులను వెంటనే అరెస్ట్ చేయాలని, సర్పంచ్‌ను పదవి నుంచి తొలగించాలని వక్తలు డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణలో నిర్లక్ష్యం చేస్తున్న అధికారిని మార్చాలని, వెల్దుర్తి మండలం ఎదులపల్లిలో దళిత మహిళా సర్పంచ్ పట్ల జరిగిన కులవివక్షపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. నవాబుపేట, కుచారం, కిష్టాపూర్, ఎదులపల్లి తదితర గ్రామాల్లో దళితులపై జరిగిన దాడులు గ్రామీణ ప్రాంతాల్లో ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. హక్కుల కోసం ప్రశ్నించిన దళితులపై దాడులు జరుగుతున్నా పోలీసులు, రెవెన్యూ అధికారులు సమర్థంగా స్పందించడం లేదని ఆరోపించారు. దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు బాధితులపైనే కౌంటర్ కేసులు నమోదు చేయడం, ఫిర్యాదుల స్వీకరణలో జాప్యం చేయడం అనుమానాలకు తావిస్తోందన్నారు.

కోనాయపల్లిలో బాధితులు ఇచ్చిన ఫిర్యాదుకు బదులుగా మరో ఫిర్యాదు రాయించుకుని కేసు నమోదు చేశారని, నవాబుపేటలో అక్టోబర్ 18న ఫిర్యాదు చేసినప్పటికీ అక్టోబర్ 25 వరకు కేసు నమోదు చేయలేదని ఆరోపించారు. హవేలీ ఘనపూర్ మండలంలో దాడికి గురైన వారిపైనే కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
1989 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టాన్ని సమర్థంగా అమలు చేయాలని, దాడులు, కులవివక్ష, అంటరానితనం, సాంఘిక బహిష్కరణ ఘటనలు జరిగిన గ్రామాలను జిల్లా కలెక్టర్, ఎస్పీ సందర్శించి బాధితులకు భరోసా కల్పించాలని అన్నారు. పండుగల సమయంలో దళిత కుటుంబాలు భయాందోళనలకు గురికాకుండా రక్షణ కల్పించాలని, బాధితులకు న్యాయం జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా కోనాయపల్లి దళిత యువకులను తూప్రాన్ సీఐ బెదిరించారని చేసిన ఆరోపణలను కూడా సమావేశం తీవ్రంగా ఖండించింది.

భవిష్యత్ కార్యాచరణ

కోనాయపల్లి దళితులపై దాడి ఘటనలో సర్పంచ్ మన్నే కళ్యాణ్, ఆయన అనుచరులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 3న జిల్లా వ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించాలని సమావేశం తీర్మానించింది. నవంబర్ 11, 12 తేదీల్లో మెదక్ కలెక్టరేట్ ఎదుట 48 గంటల నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు ప్రకటించింది. అప్పటికీ జిల్లా యంత్రాంగం స్పందించకపోతే డీజీపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో KVPS రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం. అడివయ్య, CITU జిల్లా కార్యదర్శి ఏ. మల్లేశం, DBF జిల్లా అధ్యక్షుడు దుబాసి సంజీవ్, BSP రాష్ట్ర నాయకుడు అప్పాజీపల్లి సురేష్, AIAWU జిల్లా కార్యదర్శి కె. మల్లేశం, NPRD జిల్లా కార్యదర్శి కె. యశోద, AIKS జిల్లా ఉపాధ్యక్షుడు లచ్చగౌడ్, బుడగ సంఘాల జిల్లా నాయకుడు కె. మల్లేష్, ప్రజాసంఘాల నాయకులు యాదగిరి, వెంకట్, షౌకత్, దుర్గ, కోనాయపల్లి బాధితులు ప్రవీణ్, నర్సింలు, నిరంజన్ దాసు తదితరులు పాల్గొన్నారు.

Related News

Latest News