నవంబర్ 2న తెలంగాణకు అమిత్ షా.. బేగంపేట నుంచి ఎంజే మార్కెట్ వరకు ర్యాలీ!

ప్రతిపక్షం, అక్టోబర్ 31: కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారైంది. నవంబర్ 2న ఆయన హైదరాబాద్‌కు రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా బీజేపీ నిర్వహించనున్న ర్యాలీ, బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. రాష్ట్రంలో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్న ఈ పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ఖరారైంది. మధ్యాహ్నం 2 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్న అమిత్ షా, అక్కడి నుంచి నేరుగా కాకతీయ హోటల్‌కు వెళ్లనున్నారు.

సాయంత్రం 4 గంటలకు బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద నుంచి ఎంజే మార్కెట్ వరకు నిర్వహించనున్న ర్యాలీలో అమిత్ షా పాల్గొంటారు. ఈ ర్యాలీలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా ఏర్పాట్లు చేయనున్నట్లు సమాచారం. అనంతరం సాయంత్రం 5 గంటల నుంచి 5.30 గంటల వరకు నిర్వహించే కార్నర్ మీటింగ్‌కు హాజరై ప్రసంగించనున్నారు. రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలు, పార్టీ కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై ఆయన ప్రసంగంలో ప్రస్తావించే అవకాశం ఉంది.

అమిత్ షా పర్యటనలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సమయాన్ని రిజర్వ్ షెడ్యూల్‌గా కేటాయించారు. ఈ సమయంలో తెలంగాణకు చెందిన ప్రముఖులను ఆయన కలిసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ నుంచి తిరిగి ఢిల్లీకి బయలుదేరనున్నారు. కేంద్ర హోంమంత్రి పర్యటన నేపథ్యంలో బీజేపీ శ్రేణులు ఏర్పాట్లపై దృష్టి సారించాయి.

Related News

Latest News