*ఘనంగా ఏఐటీయూసీ 107వ ఆవిర్భావ దినోత్సవం – చండూరులో జెండా ఆవిష్కరణ.
*దేశంలో ఏర్పడ్డ మొట్టమొదటి కార్మిక సంఘం ఏఐటీయూసీ.
*కార్మిక చట్టాలను 4 కోడ్ లుగా మార్చి హక్కులు కాలరాస్తున్న కేంద్రం.
*కార్మికుల హక్కుల కోసం పోరాటాలు కొనసాగిస్తాం:ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి దోటి వెంకన్న.
ప్రతిపక్షం – చండూరుఅక్టోబర్ 31: దేశంలో ఏర్పడ్డ మొట్టమొదటి కార్మిక సంఘం ఏఐటీయూసీ అని ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి దోటి వెంకన్న అన్నారు.ఏఐటీయూసీ 107వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా శనివారం చండూరులోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ జెండాను ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1920 అక్టోబర్ 31న ఏర్పాటైన ఏఐటీయూసీ స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించిందన్నారు. కార్మికులకు అనేక సంక్షేమ చట్టాలు, హక్కులు సాధించిన ఘనత ఏఐటీయూసీదే అని అన్నారు. బ్రిటీష్ పాలన కాలంలోనే కనీస వేతనాల చట్టం, సంఘం పెట్టుకునే హక్కును సాధించామన్నారు.
మోడీ ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించిన 29 చట్టాలను 4 కోడ్ లుగా మార్చి యాజమాన్యాలకు అనుకూలంగా మార్చిందని ఆరోపించారు. సంఘం పెట్టుకునే హక్కు, వేతనాల కోసం సమ్మె చేసే హక్కు లేకుండా చేయడం విచారకరమన్నారు.
కాంట్రాక్ట్ వ్యవస్థ రద్దు, కనీస వేతనాల అమలు, ఉద్యోగ భద్రత కోసం రాబోయే కాలంలో పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ చండూరు మండల అధ్యక్షుడు భూతరాజు దేవదాసు, నాయకులు చందా మధు, భూతరాజు శ్రీను, కుక్కల నాగార్జున, కావలి శ్రీను, రవి, కల్లెట్ల వెంకన్న, సత్తార్, సైదులు, నిమ్మల సత్తి తదితరులు పాల్గొన్నారు.





























