ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో జాతీయ సమైక్యత దినోత్సవం
— కళాశాల ప్రిన్సిపాల్ వి.ప్రమీల
ప్రతిపక్షం ప్రతినిధి, సిద్ధిపేట, అక్టోబరు 31: భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోందని సిద్ధిపేట ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల (కో-ఎడ్యుకేషన్) ప్రిన్సిపాల్ ప్రమీల అన్నారు. జాతీయ ఐక్యత, సమగ్రత, సోదరభావం వంటి ఉన్నత విలువలను విద్యార్థుల్లో పెంపొందించే లక్ష్యంతో సిద్దిపేట ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల (కో-ఎడ్యుకేషన్)లో శనివారం ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో జాతీయ సమైక్యత దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థినీ, విద్యార్థులతో జాతీయ సమైక్యత ప్రతిజ్ఞ చేయించారు. దేశ సమగ్రత, ఐక్యత, సమానత్వం, సోదరభావం వంటి విలువలను జీవితంలో ఆచరిస్తూ, దేశ ఐక్యతను కాపాడేందుకు కృషి చేస్తామని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి వి.ప్రమీల మాట్లాడుతూ భాషలు, సంస్కృతులు, కులాలు, మతాలు, ప్రాంతాలు వేర్వేరుగా ఉన్నప్పటికీ భారతీయులందరినీ జాతీయ భావన ఏకం చేస్తోందని పేర్కొన్నారు. కుల, మత, ప్రాంతీయ భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ దరిపల్లి నగేశ్ మాట్లాడుతూ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశంలోని సంస్థానాలను ఏకీకృతం చేసి జాతీయ సమైక్యతకు బలమైన పునాది వేశారని తెలిపారు. ఆయన చూపిన ఐక్యతా మార్గాన్ని ప్రతి విద్యార్థి ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. దేశ ఐక్యత, సమగ్రతను పరిరక్షించడం ప్రతి భారత పౌరుడి ప్రధాన బాధ్యత అన్నారు. పౌర శాస్త్రం అధ్యాపకుడు నంట శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ జాతీయ సమైక్యత దేశాభివృద్ధికి అత్యంత అవసరమని పేర్కొన్నారు. విద్యార్థులు రాజ్యాంగ విలువలను గౌరవిస్తూ, బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదిగి దేశ ప్రగతిలో భాగస్వాములు కావాలని సూచించారు.
కళాశాల సీనియర్ అధ్యాపకుడు దేవయ్య మాట్లాడుతూ, విద్యార్థులు జాతీయ జెండా ప్రతిష్ఠను కాపాడుతూ ప్రజాస్వామ్య విలువలను పాటించాలని చెప్పారు. దేశ అభివృద్ధిలో యువత తమ వంతు బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పరీక్షల నియంత్రణ అధికారి సుధాకర్ రెడ్డి, స్టూడెంట్ కౌన్సిలర్లు కనక చంద్రం, తహసీన్ ఫాతిమా, స్పోర్ట్స్ ఇన్చార్జ్ అశోక్, అధ్యాపకులు రాజ్యలక్ష్మి, రఘురాజ్, గంగాధర్, కౌసర్, సత్యనారాయణ, విజయభాస్కర్, నరేందర్ రెడ్డి, శ్రీకాంత్, బేతి శ్రీనివాస్, చక్రవర్తి, రాజశేఖర్, వెంకట రమణ, రవి, దాసు, కొమరయ్య, రాజశేఖర రెడ్డి, విఠల్, వెంకటేశ్, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు






























