కొనుగోళ్లలో జాప్యం.. అన్నదాతకు శాపం!

ప్రభుత్వ నిర్లక్ష్యం.. రైతుకు తప్పని నష్టం!

పంట చేతికొచ్చినా.. రైతుకు కష్టాలు తప్పవా?

పండించిన గింజకు గిట్టుబాటు ఎక్కడ?

నంగునూరును కరువు మండలంగా ప్రకటించాలి

– బీఆర్ఎస్ డిమాండ్

ప్రతిపక్షం, నంగునూరు, అక్టోబరు 31: పంట చేతికొచ్చినా కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి రాక రైతులు ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ జాప్యం అన్నదాతలకు నష్టాన్ని మిగులుస్తోందని విమర్శించారు. నంగునూరు మండలాన్ని వెంటనే కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నంగునూరులోని ప్రైవేట్ వేడుక మందిరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఉమ్మడి మెదక్ జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ రాగుల సారయ్య, మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ ఎడ్ల సోమిరెడ్డి, నంగునూరు సర్పంచి సనాదుల బాల పోచయ్య, మండల బీ ఆర్ ఎస్ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రేకులపల్లి సంతోష్ రెడ్డి, ఉప సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు కోల శ్రీధర్ గౌడ్, రైతు బంధు సమితి మండల మాజీ సమన్వయకర్త బద్దిపడగ కిష్టారెడ్డి, నంగునూరు గ్రామ శాఖ బీ ఆర్ ఎస్ అధ్యక్షుడు ఉల్లి మల్లయ్య, నాయకులు కరెడ్ల లక్ష్మారెడ్డి, కోల మహేందర్ గౌడ్, చౌడుచర్ల జయపాల్ రెడ్డి, వల్లపురెడ్డి రాంరెడ్డి, రంగు రాజు, అనగోని పరశురాములు గౌడ్, బెదురు తిరుపతి, ఎండి అజీజ్, బొంగోని శ్రీనివాస్, బండి మల్లేశం తదితరులు మాట్లాడారు.

రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలు పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పంట కోతలు పూర్తై రోజులు గడుస్తున్నా ప్రభుత్వ యంత్రాంగం స్పందించక పోవడం బాధాకరమన్నారు. గన్నీ బ్యాగుల కొరత రైతులకు సమస్యగా మారిందని తెలిపారు. దీంతో రైతులు ప్రైవేటు వ్యాపారులు, దళారుల వైపు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. మద్దతు ధర అందక తక్కువ ధరలకు ధాన్యాన్ని విక్రయిస్తూ అన్నదాతలు నష్టపోతున్నారని పేర్కొన్నారు. “చివరి గింజ వరకు మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయాలి” అని నాయకులు డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాలను వెంటనే పూర్తిస్థాయిలో ప్రారంభించాలని కోరారు.

కరువు మండలంగా ప్రకటించాలి

నంగునూరు మండలంలో వర్షాభావ పరిస్థితులు వ్యవసాయంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని నాయకులు తెలిపారు. రైతుల పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని నంగునూరును కరువు మండలంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. సాగునీరు, పంట సహాయం, ఇతర ప్రభుత్వ ప్రయోజనాలను రైతులకు అందించాలని విజ్ఞప్తి చేశారు. రంగనాయక సాగర్ వంటి ప్రాజెక్టుల ప్రయోజనాలు ఈ ప్రాంత రైతులకు చేరేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించాలని నాయకులు డిమాండ్ చేశారు. గన్నీ బ్యాగుల కొరతను నివారించి కొనుగోళ్లను వేగవంతం చేయాలని కోరారు. నంగునూరును కరువు మండలంగా ప్రకటించి అన్నదాతకు అండగా నిలవాలి అని బీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేశారు.

Related News

Latest News