మాదిగల అభ్యున్నతికి ప్రత్యేక బడ్జెట్ కావాలి

ఆర్థిక, విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో సమగ్ర అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి

– దేవుని సతీశ్ మాదిగ

ప్రతిపక్షం ప్రతినిధి, సిద్ధిపేట, అక్టోబరు 31: మాదిగల ఆర్థిక, విద్యా, ఉద్యోగ, రాజకీయ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర సీనియర్ నేత దేవుని సతీశ్ మాదిగ డిమాండ్ చేశారు.సిద్ధిపేట ప్రెస్‌క్లబ్‌లో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకత్వం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన దేవుని సతీశ్ మాదిగ మాట్లాడుతూ మాదిగల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని కోరారు. తెలంగాణలో అంటరానితనాన్ని ప్రోత్సహించిన కేసీఆర్‌కు, ఆయన పార్టీకి దళిత సమాజం తగిన సమాధానం చెబుతుందని అన్నారు. గతంలో ఎర్రవల్లి ఫామ్‌హౌస్ వద్ద దళితులు డప్పులు కొట్టిన ప్రాంతం మైలపడిందంటూ పసుపు నీళ్లు చల్లించిన ఘటనను ఆయన ప్రస్తావించారు.

ఈ ఘటనకు నిరసనగా రాష్ట్రంలోని 33 జిల్లాల కేంద్రాల్లో చావు డప్పులతో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్యలను సహించబోమని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ అమలుతో మాదిగ విద్యార్థులకు విద్యా, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో పాటు మాదిగల ఆర్థికాభివృద్ధికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని కోరారు. విద్య, ఉపాధి, రాజకీయ రంగాల్లో తగిన అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.గత మూడు దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం ఉద్యమించిన ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. వారి కుటుంబాలకు సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక భరోసా కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

మాదిగ జాతి అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని దేవుని సతీష్ మాదిగ తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్ద మాతరి బాబు, బొందని రాజమల్లు మాదిగ, బాబురావు, రోమాల బాకూర్ అశోక్, ధర్మారం ఎల్లం, గద్దరాజు రాజు, కాకి రాజ్యం, వేముల శ్రీనివాస్, గ్యార ఎల్లయ్య, గాజుల రవి, ఏల దేవయ్య, కాటపాక రాజు, మాదాసు బాబు, తూటి జాంగిర్ తదితర ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. వికలాంగుల సంఘం నాయకులు దండు శంకర్, గోపని చంద్రం, రంగధాం భాను, పోలపురం కనకయ్య, దూలపల్లి కిష్టయ్య, లింగంపల్లి యాదగిరి, గజరాజు రాజుతో పాటు వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related News

Latest News