మెదక్‌ను కరువు జిల్లాగా ప్రకటించాల్సిందే!

రైతుల కష్టాలు ప్రభుత్వానికి కనిపించడం లేదా?

గ్రామం యూనిట్‌గా పంట నష్టాన్ని అంచనా వేయాలి – కరువు నిర్ధారణకు శాస్త్రీయ విధానాలు పాటించాలి

మంజీరా జలాలపై మెదక్ రైతులకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలి

డిమాండ్లను పట్టించుకోకుంటే దశలవారీ ఉద్యమం

రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల డిమాండ్

ప్రతిపక్షం ప్రతినిధి,మెదక్, అక్టోబర్ 31: మెదక్ జిల్లాలో నెలకొన్న వ్యవసాయ పరిస్థితులు, వర్షాభావం, పంటల నష్టాన్ని సమగ్రంగా పరిశీలించి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని రౌండ్ టేబుల్ సమావేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. కరువు నిర్ధారణలో మండలాన్ని కాకుండా గ్రామాన్ని యూనిట్‌గా తీసుకొని శాస్త్రీయ పద్ధతుల్లో పంట నష్టాన్ని అంచనా వేయాలని వక్తలు కోరారు.మెదక్ సిటిజన్స్ ఫోరం, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (హెచ్-143), తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఐజేయూ), రైతు స్వరాజ్య వేదిక, మెదక్ స్టడీ సర్కిల్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం మెదక్ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు పాల్గొని మాట్లాడారు.

సిటిజన్స్ ఫోరం అధ్యక్షుడు బి. కొండల్ రెడ్డి, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి అజయ్, సీపీఎం నేత మల్లేశం, బీఆర్ఎస్ కన్వీనర్ మామిళ్ల ఆంజనేయులు, మానవ హక్కుల వేదిక నేత హైమద్ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోకుండా మండలాలను ప్రాతిపదికగా చేసుకొని కరువును నిర్ధారించడం వల్ల వాస్తవ పంట నష్టం వెలుగులోకి రావడం లేదన్నారు.ఒకే మండలంలోని కొన్ని గ్రామాల్లో పంటలు పూర్తిగా ఎండిపోతే, మరికొన్ని గ్రామాల్లో పరిస్థితులు భిన్నంగా ఉండవచ్చని పేర్కొన్నారు. అందువల్ల గ్రామాన్ని యూనిట్‌గా తీసుకొని సాగు విస్తీర్ణం, వర్షపాతం, భూగర్భ జలాలు, దిగుబడులు, పంటల నష్టాన్ని శాస్త్రీయంగా అంచనా వేయాలని డిమాండ్ చేశారు.

జిల్లా పరిధిలో మంజీరా నది ప్రవహిస్తున్నప్పటికీ మెదక్ రైతులు సాగునీటి కోసం ఇబ్బందులు పడటం బాధాకరమన్నారు. మంజీరా జలాల వినియోగంలో మెదక్ జిల్లా రైతాంగానికి తొలి ప్రాధాన్యం కల్పించాలని, స్థానిక నీటి వనరులను వ్యవసాయ అవసరాలకు ఉపయోగించేలా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని కోరారు.రైతులు ఎదుర్కొంటున్న వర్షాభావం, పంట నష్టాలు, సాగునీటి కొరతను ప్రభుత్వం గుర్తించి తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని, నష్టపోయిన రైతులందరికీ తగిన పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. రైతు వ్యతిరేక విధానాలను విడనాడి క్షేత్రస్థాయి వాస్తవాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలని హితవు పలికారు.

మెదక్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి అర్హులైన రైతులందరికీ న్యాయం చేయాలని, ప్రభుత్వం స్పందించకపోతే రైతులు, ప్రజాసంఘాలు, వివిధ వర్గాలను కలుపుకొని దశలవారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా రైతాంగ సమస్యలకు సంబంధించిన 27 తీర్మానాలను సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది.ఈ సమావేశంలో తెలంగాణ రైతు రక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు మైసయ్య యాదవ్, మెదక్ సిటిజన్స్ ఫోరం నాయకులు పి.డి. ఆనందం, భాగయ్య, బీసీ సంఘం నేత బాలరాజ్ గౌడ్, టీయూడబ్ల్యూజే (హెచ్-143) జిల్లా కన్వీనర్ సురేందర్ రెడ్డి, టీయూడబ్ల్యూజే (ఐజేయూ) నాయకుడు మెంగర్తి సుధాకర్, టీపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్రామిరెడ్డితో పాటు వివిధ రాజకీయ పార్టీల, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Related News

Latest News