నంగునూరులో ఘన నివాళులు
దేశ ఐక్యత, సమగ్రత కోసం ఆమె చేసిన కృషి చరిత్రాత్మకం
ధైర్యం, దూరదృష్టి, నాయకత్వానికి నిలువెత్తు నిదర్శనం
– ఏఎంసీ వైస్ చైర్మన్ సాదుల పవన్ కుమార్
ప్రతిపక్షం, నంగునూరు, అక్టోబరు 31: దేశ ఐక్యత, సమగ్రత, అభివృద్ధి కోసం ఇందిరాగాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని నంగునూరు ఏఎంసీ వైస్ చైర్మన్ సాదుల పవన్ కుమార్ అన్నారు. దేశ రాజకీయ చరిత్రలో తనదైన ముద్ర వేసిన భారత మాజీ ప్రధానమంత్రి, ఉక్కు మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని నంగునూరులో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. ఆమె సేవలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా నంగునూరు ఏఎంసీ వైస్ చైర్మన్ సాదుల పవన్ కుమార్ మాట్లాడుతూ దేశ తొలి మహిళా ప్రధానమంత్రిగా ఆమె అసాధారణ ధైర్య సాహసాలతో కీలక నిర్ణయాలు తీసుకుని భారత రాజకీయ చరిత్రలో ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించారని పేర్కొన్నారు.పేదల సంక్షేమం, దేశాభివృద్ధి, జాతీయ సమగ్రత కోసం ఇందిరా గాంధీ తీసుకున్న నిర్ణయాలు దేశ చరిత్రలో శాశ్వతంగా నిలిచి పోతాయన్నారు. దేశ ప్రయోజనాల కోసం ఆమె చూపిన దృఢ సంకల్పం, చేసిన త్యాగాలు ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఆమె ఆశయాలను భావితరాలకు చేరవేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
కాంగ్రెస్ పార్టీ మండల శాఖ మాజీ అధ్యక్షుడు ఎండి ఇమ్రాన్ మాట్లాడుతూ, ఇందిరాగాంధీ చూపిన ధైర్యం, పట్టుదల, దూరదృష్టి, నాయకత్వ లక్షణాలు నేటి యువతకు ఆదర్శప్రాయమని అన్నారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ దేశ ప్రయోజనాల కోసం ఆమె తీసుకున్న నిర్ణయాలు ఆమె అసమాన నాయకత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త అంకితభావంతో కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్లు జీవన్ నాయక్, పిడిశెట్టి ప్రభాకర్, పీఏసీఎస్ డైరెక్టర్ కరెడ్ల వెంకట్ రెడ్డి, గడ్డం కరుణాకర్ రెడ్డి, శ్యామ్ రెడ్డి, లింగంపల్లి అజయ్, భాను, బోజు బాబు, శంకరయ్యతో పాటు స్థానిక కాంగ్రెస్ నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు, యువకులు, గ్రామస్తులు పాల్గొని ఇందిరాగాంధీకి నివాళులర్పించారు.





























