[t4b-ticker]

క్రెడిట్ కార్డు బకాయితో బలవంతపు రిటైర్మెంట్.. బ్యాంకుకు హైకోర్టు చీవాట్లు

ప్రతిపక్షం, జూలై 30: క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించలేదనే కారణంతో ఉద్యోగిని బలవంతంగా పదవీ విరమణ చేయించడం చట్టవిరుద్ధమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. హైదరాబాద్‌కు చెందిన ప్రకాశ్ బాబు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం, యూనియన్ బ్యాంకు అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

ప్రకాశ్ బాబు యూనియన్ బ్యాంకులో సుమారు 30 సంవత్సరాలు సేవలందించారు. అయితే 2009లో క్రెడిట్ కార్డు బకాయిలను కారణంగా చూపుతూ తనను పై అధికారులు బలవంతంగా పదవీ విరమణ చేయించారని ఆయన కోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు, ఉద్యోగిపై తీసుకున్న చర్యలు న్యాయసమ్మతం కాదని తేల్చింది.

ఈ నేపథ్యంలో ప్రకాశ్ బాబును ఆయన సాధారణ పదవీ విరమణ తేదీ వరకు ఉద్యోగంలో కొనసాగినట్లుగా పరిగణించాలని హైకోర్టు ఆదేశించింది. అంతేకాకుండా ఆ కాలానికి సంబంధించిన జీతభత్యాలు, పెన్షన్, గ్రాట్యుటీతో పాటు ఇతర సేవా ప్రయోజనాలన్నింటినీ చట్టప్రకారం చెల్లించాలని యూనియన్ బ్యాంకును ఆదేశించింది.

ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే విషయంలో నిబంధనలు, సహజ న్యాయ సూత్రాలను తప్పనిసరిగా పాటించాలని హైకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. ఈ తీర్పు ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు కీలకమైనదిగా భావిస్తున్నారు.

Spread the love

Related News

Latest News