నమూనా పార్లమెంట్‌లో సిద్ధిపేట విద్యార్థినుల ఘన విజయం

మాక్ పార్లమెంట్‌లో సిద్ధిపేట సత్తా

33 జిల్లాల నుంచి పాల్గొన్న 66 మంది

వీరిలో ఉత్తమ పార్లమెంటీరియన్లుగా ఎనిమిది మంది ఎంపిక

ఎనిమిది మందిలో ఇద్దరు సిద్ధిపేట జిల్లా విద్యార్థినులు

అక్కెనపల్లి మోడల్ స్కూల్ నుంచి జీల రక్షిత,ఇందిరా నగర్ జెడ్పీ స్కూల్ నుంచి ఆనంది ఎంపిక

ప్రతిపక్షం, నంగునూరు, నవంబరు 1: రాష్ట్ర స్థాయి వేదికపై సిద్ధిపేట జిల్లా విద్యార్థినులు సత్తా చాటారు. నమూనా పార్లమెంట్ పోటీలలో పాల్గొన్న 66 మంది విద్యార్థుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఎనిమిది మందిలో ఇద్దరు సిద్దిపేట విద్యార్థినులు చోటు దక్కించుకున్నారు. అక్కెనపల్లి పీఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థిని జీల రక్షిత, ఇందిరా నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఆనంది అనే విద్యార్థులు ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డును అందుకొని జిల్లా కీర్తిని ఇనుమడింపజేశారు.

33 జిల్లాల నుంచి 66 మంది

తెలంగాణ పాఠశాల విద్యాశాఖ, ఎస్‌సీఈఆర్‌టీ ఆధ్వర్యంలో అక్టోబర్ శుక్ర, శనివారాలలో హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర స్థాయి పాఠశాలల నమూనా పార్లమెంట్ పోటీలు నిర్వహించారు. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి ఎంపికైన 66 మంది ప్రతిభావంతులైన విద్యార్థులు పోటీపడ్డారు. విద్యార్థుల నాయకత్వ లక్షణాలు, ప్రజాస్వామ్య విలువలపై అవగాహన, పార్లమెంటరీ విధానాలపై పట్టు, సభలో వ్యవహరించిన తీరు వంటి అంశాలను పరిశీలించి ఉత్తమ విజేతలను ఎంపిక చేశారు. ఎనిమిది మందిని ఉత్తమ పార్లమెంటేరియన్లుగా అవార్డులు అందించారు. ఈ ఎనిమిది మందిలో సిద్ధిపేట జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్థినులు ఎంపిక కావడం విశేషం.
మొత్తం 66 మంది విద్యార్థుల్లో కేవలం ఎనిమిది మందిని మాత్రమే ‘ది బెస్ట్’ గా ఎంపిక చేశారు. ఈ జాబితాలో సిద్ధిపేట జిల్లా నుంచి ఇద్దరు విద్యార్థినులు ఉండటం విశేషం. అక్కెనపల్లి పీఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థిని జీల రక్షిత, ఇందిరానగర్ విద్యార్థిని ఆనంది అత్యుత్తమ విద్యార్థుల జాబితాలో స్థానం సంపాదించారు. వారి విజయం జిల్లాకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది.

రక్షిత, ఆనందిలకు ప్రతిష్ఠాత్మక పురస్కారం

నమూనా పార్లమెంటులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అద్భుతంగా ప్రజా సమస్యలపై చర్చించిన న జీల రక్షిత, ఆనంది లకు ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు లభించింది. రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు డా.నవీన్ నికోలస్ చేతుల మీదుగా వారు ఈ పురస్కారాన్ని అందుకున్నారు. రాష్ట్ర స్థాయి పోటీలో అత్యుత్తమ విద్యార్థినులుగా ఇద్దరు నిలవడం అక్కెనపల్లి తెలంగాణ మోడల్ స్కూల్‌, ఇందిరానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలకే కాక సిద్ధిపేట జిల్లాకు గర్వ కారణంగా మారింది.

మార్గదర్శకత్వమే విజయానికి బాట

ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు, సిద్ధిపేట అర్బన్ మండల విద్యాధికారి అమ్మన రాజప్రభాకర రెడ్డి, అక్కెనపల్లి తెలంగాణ ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ మంద జానయ్యలు మాట్లాడుతూ, కఠినమైన పోటీలో ఆనంది, రక్షిత సాధించిన విజయం ఎంతో గొప్పదన్నారు. ఎనిమిది మంది అత్యుత్తమ విద్యార్థుల జాబితాలో చోటు సంపాదించడం వారి ప్రతిభకు నిదర్శనమని కొనియాడారు. ఈ విజయానికి గైడ్ టీచర్ సీహెచ్.రజని అందించిన మార్గదర్శకత్వం కీలకమని పేర్కొన్నారు. ఆనంది, రక్షితతో పాటు గైడ్ టీచర్ రజనిని ప్రత్యేకంగా అభినందించారు.

ఆత్మవిశ్వాసమే అసలు ఆయుధం

గైడ్ టీచర్ సీహెచ్.రజని మాట్లాడుతూ, విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, వారికి సరైన దిశానిర్దేశం అందించామని తెలిపారు. సభలో ధైర్యంగా మాట్లాడటం, హుందాగా వ్యవహరించడం, పార్లమెంటరీ విధానాలను అర్థం చేసుకోవడం వంటి అంశాలపై శిక్షణ ఇచ్చామని చెప్పారు.“ప్రతిభకు సరైన అవకాశం, సరైన మార్గదర్శకత్వం లభిస్తే విద్యార్థులు అద్భుతాలు సాధిస్తారు” అని ఆమె పేర్కొన్నారు. ఇందిరా నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు మామిళ్ళ లక్ష్మారెడ్డి, పబ్బతి శ్రీనాకర్ రెడ్డి, నీరజ, విజయలక్ష్మి, రవికుమార్, రామిని సత్యలక్ష్మి, అక్కెనపల్లి తెలంగాణ ఆదర్శ పాఠశాల సీనియర్ అధ్యాపకుడు డా.ఎస్.శ్రీనివాస్ సాంఘిక శాస్త్ర అధ్యాపకులు ఎ. శ్రీనివాస్, ఎస్. రవీందర్ రెడ్డి, ఎం.శ్రీనివాస్, సీనియర్ అధ్యాపకులు నర్సయ్య, సుధాకర్, పరశురాములు, స్వాతి, మాధవి, రవీందర్ తదితరులు ఆనంది, రక్షిత సాధించిన విజయాన్ని అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

సిద్ధిపేటకు గర్వకారణం

రాష్ట్ర స్థాయి మాక్ పార్లమెంట్ వేదికపై ఇద్దరు విద్యార్థినులు అత్యుత్తముల జాబితాలో నిలవడం సిద్ధిపేట జిల్లా విద్యారంగానికి గర్వకారణంగా మారింది. ఆనంది, జీల రక్షిత అందుకున్న ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డులు విద్యార్థుల్లో ప్రతిభకు అవకాశమిస్తే వారు రాష్ట్ర స్థాయిలోనూ తమ సత్తా చాటగలరనే సందేశాన్ని ఇచ్చిందని సిద్ధిపేట జిల్లా పరిషత్ సీఈవో, ఇంఛార్జి సిద్ధిపేట జిల్లా విద్యాధికారి రమేశ్ పేర్కొన్నారు.
కృషి ఉంటే విజయం దూరం కాదని నిరూపించిన ఈ విద్యార్థినుల ఘనత సిద్దిపేట విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలిచిందని అభినందించారు.

Related News

Latest News