ప్రతిపక్షం, నవంబర్ 03: మురసు తుఫాను ప్రభావంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అప్రమత్తమయ్యారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తుఫాను ప్రభావం, వర్షపాతం పరిస్థితులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
సమీక్ష సందర్భంగా జిల్లాలో ఇప్పటివరకు నమోదైన వర్షపాతం వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. తుఫాను కారణంగా వ్యవసాయ రంగంపై ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉందో అధికారులతో చర్చించారు. ముఖ్యంగా వరి పంట పరిస్థితి, పొలాల్లో నీరు నిలిచే అవకాశాలు, రైతులు ఎదుర్కొనే ఇబ్బందులపై వివరాలు సేకరించారు. భారీ వర్షాలు కురిసే పరిస్థితులు ఏర్పడితే పంటలకు నష్టం కలగకుండా అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులకు అందుబాటులో ఉండి వారి సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించేలా వ్యవసాయ శాఖ అధికారులు పనిచేయాలని తెలిపారు.
అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వల పరిస్థితిని కూడా తుమ్మల సమీక్షించారు. వర్షాల నేపథ్యంలో జలాశయాలకు వచ్చే నీటి ప్రవాహాలను ఎప్పటికప్పుడు గమనించాలని, నీటి నిల్వలు, విడుదలకు సంబంధించిన వివరాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని అధికారులకు సూచించారు. వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు, వ్యవసాయ భూములు, రహదారుల వద్ద సమస్యలు తలెత్తకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
తుఫాను ప్రభావంతో ప్రజలకు, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి సిబ్బందికి అవసరమైన సూచనలు జారీ చేసి, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని కోరారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తక్షణ స్పందనకు సిద్ధంగా ఉండాలని, ఎక్కడైనా నష్టం జరిగినట్లు సమాచారం అందితే వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించినట్లు సమాచారం.




























