స్విగ్గీలో ఇక ఎల్పీజీ సిలిండర్ల డెలివరీ.. దేశంలో తొలిసారి సేవలు ప్రారంభం

ప్రతిపక్షం, జూలై 15: ఆన్‌లైన్ డెలివరీ సేవల్లో మరో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతూ స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) కలిసి దేశంలోనే తొలిసారిగా ఎల్పీజీ సిలిండర్ల హోమ్ డెలివరీ సేవలను ప్రారంభించాయి. తొలి దశలో ఈ సేవలను బెంగళూరులో అందుబాటులోకి తీసుకువచ్చాయి.

స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ యాప్ ద్వారా వినియోగదారులు 10 కిలోల హెచ్‌పీ నవ్య మరియు 5 కిలోల ఎల్పీజీ సిలిండర్లను సులభంగా బుక్ చేసుకోవచ్చు. ఈ సేవను వినియోగించుకోవడానికి సాధారణ ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ అవసరం లేకపోవడం విశేషం. వినియోగదారుల గుర్తింపు ధృవీకరణ అనంతరం సిలిండర్లను తక్కువ సమయంలోనే ఇంటి వద్దకు చేరవేస్తారు.

మొదటి ఆర్డర్‌లో కొత్త సిలిండర్‌ను అందజేస్తారు. అనంతరం రీఫిల్ అవసరమైనప్పుడు ఖాళీ సిలిండర్‌ను ఇచ్చి కొత్త సిలిండర్‌ను పొందే అవకాశం ఉంటుంది. ఈ సేవతో చిన్న సిలిండర్ల కొనుగోలు, వినియోగం మరింత సులభతరం కానుందని సంస్థలు వెల్లడించాయి.

Spread the love

Related News

Latest News