‘ఫౌజీ’ పోస్టర్‌తో అదరగొట్టిన ప్రభాస్.. అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్నంటిన సినిమా!

ప్రతిపక్షం, జూలై 16: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ‘ఫౌజీ’ చిత్రం నుంచి విడుదలైన తాజా పోస్టర్ అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని నింపింది. ఒక్క పోస్టర్‌తోనే సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచిన హను రాఘవపూడి, ప్రభాస్‌ను ఇప్పటివరకు చూడని ఇంటెన్స్ అవతార్‌లో ఆవిష్కరించారు. యుద్ధభూమి నేపథ్యంలో రక్తంతో తడిసిన దుస్తులు, చేతిలో తుపాకీ, గంభీరమైన చూపుతో కనిపిస్తున్న ప్రభాస్ లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఆయన ధరించిన జంధ్యం పాత్రపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఇప్పటివరకు భావోద్వేగ ప్రధాన చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హను రాఘవపూడి, ఈసారి పూర్తిస్థాయి మాస్ యాక్షన్ నేపథ్యంలో ప్రభాస్‌ను చూపించబోతున్నారనే సంకేతాలు పోస్టర్ ద్వారా స్పష్టమయ్యాయి. దీంతో ఈ సినిమా కథ ఎలా ఉండబోతోందనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. “ఇంత పవర్‌ఫుల్ లుక్ ఊహించలేదు”, “హను నుంచి ఇలాంటి మాస్ ట్రీట్ వస్తుందని అనుకోలేదు”, “ఇది ప్రభాస్ కెరీర్‌లో మరో బ్లాక్‌బస్టర్ అవుతుంది” అంటూ అభిమానులు పోస్టర్‌ను విపరీతంగా షేర్ చేస్తున్నారు.

సినిమా పోస్టర్ విడుదలైన కొద్ది సేపటికే సోషల్ మీడియా వేదికల్లో ట్రెండ్ అవుతుండగా, ప్రభాస్ అభిమానులు ఈ చిత్రాన్ని ఇప్పటికే భారీ విజయంగా అభివర్ణిస్తున్నారు. యాక్షన్, భావోద్వేగాలు, దేశభక్తి అంశాల మేళవింపుగా ఈ సినిమా రూపొందుతుందనే ప్రచారం కూడా ఆసక్తిని మరింత పెంచుతోంది. పోస్టర్‌తోనే ఇంతటి సంచలనం సృష్టించిన ‘ఫౌజీ’ నుంచి త్వరలో విడుదల కానున్న టీజర్, ట్రైలర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Spread the love

Related News

Latest News