Trending Now

అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో తెలుసా?

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్మిక ఉద్యమం నుంచి పుట్టుకొచ్చింది. దీనిని ఐక్యరాజ్య సమితి గుర్తించి, ఏటా నిర్వహిస్తోంది. దీని పుట్టుకకు బీజాలు 1908లో పడ్డాయి. తక్కువ పనిగంటలు, మెరుగైన జీతం, ఓటు వేసే హక్కు కోసం న్యూయార్క్ సిటీలో 15 వేల మంది మహిళలు ప్రదర్శన చేశారు. ఈ మహిళల డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని అమెరికాలోని సోషలిస్టు పార్టీ 1909వ సంవత్సరంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది. ఈ దినోత్సవాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించాలన్న ఆలోచన క్లారా జెట్కిన్ అనే ఒక మహిళది. కోపెన్‌హెగెన్‌ నగరంలో 1910లో జరిగిన ‘ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్‌’ సదస్సులో ఆమె ఈ ప్రతిపాదన చేశారు. 17 దేశాల నుంచి ఈ సదస్సుకు హాజరైన 100 మంది మహిళలు క్లారా జెట్కిన్ ప్రతిపాదనను ఏకగ్రీవంగా అంగీకరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని తొలిసారిగా 1911లో ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ, స్విట్జర్లాండ్‌ దేశాల్లో నిర్వహించారు. అయితే, 1975వ సంవత్సరంలోనే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి అధికారికంగా నిర్వహించటం ప్రారంభించింది. ఐక్యరాజ్యసమితి 1975లో ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రారంభించింది, రెండేళ్ల తర్వాత 1977లో యూఎన్‌ జనరల్ అసెంబ్లీ మార్చి 8ని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించింది. ఇలా మహిళా దినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి.

మార్చి 8నే ఎందుకు జరుపుకోవాలి..?

1917 యుద్ధ సమయంలో రష్యా మహిళలు ”ఆహారం – శాంతి” డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగారు. నాలుగు రోజుల తర్వాత అప్పటి రష్యా సామ్రాట్ నికోలస్ జా 2 సింహాసనాన్ని వదులుకోవాల్సి వచ్చింది. అప్పుడు తాత్కాలికంగా ఏర్పాటైన ప్రభుత్వం మహిళలకు ఓటు వేసే హక్కును మంజూరు చేసింది. మహిళలు ఈ సమ్మెకు దిగిన రోజు జూలియన్ క్యాలెండర్ ప్రకారం (అప్పట్లో రష్యాలో ఈ క్యాలెండర్‌నే అనుసరించేవాళ్లు) ఫిబ్రవరి 23 ఆదివారం. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం.. చూస్తే అది మార్చి 8వ తేదీ. అందుకే మార్చి 8వ తేదీన (ప్రపంచవ్యాప్తంగా అత్యధిక దేశాల్లో ఇప్పుడు అమలులో ఉన్నది గ్రెగోరియన్ క్యాలెండర్) అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకొంటున్నారు.

Spread the love

Related News

Latest News