ఆపదలో ఉన్న చిన్నారికి హరీశ్ రావు ఆపన్నహస్తం!

కిడ్నీ సమస్యతో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 12 ఏళ్ల సాయి

రూ.10 వేల ఆర్థిక సాయం అందించిన హరీశ్ రావు

ప్రతిపక్షం, నంగునూరు, నవంబరు 3: ఆపదలో ఉన్నారని తెలిస్తే స్పందించడం.. కష్టాల్లో ఉన్నారని తెలిస్తే అండగా నిలవడం.. ఆర్థిక ఇబ్బందులతో వైద్యం అందక ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు చేయూతనివ్వడం మానవత్వానికి నిదర్శనం. ఈ కోవలోనే కిడ్నీ సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 12 ఏళ్ల చిన్నారి వైద్యానికి మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు ఆర్థిక సహాయం అందించి మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు.నంగునూరు మండలం ఖాత గ్రామానికి చెందిన ఆరేపల్లి సాయి (12) నెల రోజులుగా కిడ్నీ సమస్యతో బాధపడుతూ హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. చిన్నారి అనారోగ్యంతో బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వైద్య ఖర్చుల భారంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని గ్రామ సర్పంచ్ తెలుసుకున్నారు.

వెంటనే స్పందించిన గ్రామ సర్పంచ్ చిన్నారి పరిస్థితిని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు దృష్టికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న హరీశ్ రావు తక్షణమే స్పందించి చిన్నారి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.10,000 ఆర్థిక సహాయం అందజేశారు. మెరుగైన వైద్యం అందించే విధంగా కృషి చేస్తానని తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు.

చిన్నారి కుటుంబానికి భరోసా.. ఆపదలో అండగా నిలిచిన నాయకుడు

అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారికి ఆర్థిక చేయూత అందించడం పట్ల కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. కష్టకాలంలో తమ కుటుంబానికి అండగా నిలిచి, చిన్నారి వైద్యానికి సహాయం అందించిన హరీశ్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆపదలో ఉన్న కుటుంబాలకు సకాలంలో సహాయం అందడం ఎంతో ఊరటనిస్తుందని గ్రామస్థులు పేర్కొన్నారు. చిన్నారి సాయి త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి తిరిగి రావాలని ఆకాంక్షించారు.

Related News

Latest News