ధాన్యం అమ్ముకునేందుకు పొలానికి వెళ్తూ రైతు దుర్మరణం!

ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుడు కరువు.. విద్యుత్ సౌకర్యం కూడా కరువే!

రైతు కుటుంబానికి పరిహారం అందించాలి – ప్రభుత్వ ఆసుపత్రి నిర్లక్ష్యంపై విచారణ జరపాలి

ప్రతిపక్షం ప్రతినిధి, మెదక్, నవంబర్ 4: ధాన్యం అమ్ముకునేందుకు పొలానికి వెళ్తున్న రైతును గుర్తుతెలియని కారు ఢీకొట్టడంతో ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. మరోవైపు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాధితుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడ డ్యూటీ వైద్యుడు అందుబాటులో లేకపోవడంతోపాటు కనీసం విద్యుత్ సౌకర్యం కూడా లేదని కుటుంబ సభ్యులు ఆరోపించడం కలకలం రేపుతోంది.
హవేలీ ఘనపూర్ మండలం ఔరంగాబాద్ గ్రామానికి చెందిన రైతు తిరుపతి కిషన్ (65) తన వరి పంటను కోసి ధాన్యాన్ని విక్రయించేందుకు సిద్ధం చేసుకున్నారు. గ్రామ పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం లేకపోవడంతో ప్రైవేటు వ్యాపారులకు ధాన్యం విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో నవంబర్ 3వ తేదీ రాత్రి 10.45 గంటల సమయంలో వ్యవసాయ పొలం వద్దకు వెళ్లేందుకు ఇంటి నుంచి బయలుదేరారు.

ఔరంగాబాద్ గేట్ వద్ద పంచముఖి హనుమాన్ దేవాలయం సమీపంలో రోడ్డు దాటుతుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన గుర్తుతెలియని కారు ఆయనను బలంగా ఢీకొట్టి పరారైంది. ఈ ప్రమాదంలో తలకు, శరీరంలోని ఇతర భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినప్పటికీ ఆయన ప్రాణాలు కోల్పోయారు.అయితే ఆసుపత్రిలో విధుల్లో ఉండాల్సిన వైద్యుడు అందుబాటులో లేకపోవడం, కనీస విద్యుత్ సదుపాయం కూడా లేకపోవడంపై కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో వైద్య సేవలు అందితే రైతు ప్రాణాలు నిలిచేవా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఆరోపణలపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరపాలని వారు డిమాండ్ చేస్తున్నారు.మృతుడు తిరుపతి కిషన్‌కు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. వ్యవసాయమే జీవనాధారంగా ఉన్న కుటుంబం పెద్ద దిక్కును కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. పంట పండించేందుకు చేసిన కష్టం ఒకవైపు, పంట అమ్ముకునేందుకు కొనుగోలు కేంద్రం లేకపోవడం మరోవైపు రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, ప్రమాదానికి కారణమైన గుర్తుతెలియని కారును సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా గుర్తించి డ్రైవర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మెదక్ ఏరియా హాస్పిటల్కు తరలించారు.

Related News

Latest News