ప్రతిపక్షం, నవంబర్ 04: తెలంగాణలో ఉపాధి హామీ పథకం అమలులో సరికొత్త రికార్డు నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజులో ఏకంగా 5 లక్షల మంది కూలీలు ఉపాధి హామీ పనులకు హాజరయ్యారు. వీబీజీ రామ్ జీ పథకం కింద నవంబర్ నెలలో ఇంత భారీ సంఖ్యలో కూలీలకు ఒకే రోజు పని కల్పించడం ఇదే తొలిసారి కావడం విశేషం. గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు ఉపాధి కల్పించడంతో పాటు గ్రామాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేసే దిశగా ఈ కార్యక్రమం కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో పెద్ద సంఖ్యలో కూలీలు పనులకు హాజరుకాగా, నల్గొండ జిల్లా ఈ విషయంలో ముందంజలో నిలిచింది. ఒక్క నల్గొండ జిల్లాలోనే అత్యధికంగా 53 వేల మంది కూలీలు ఉపాధి హామీ పనుల్లో పాల్గొన్నారు. దీంతో రాష్ట్రంలో ఒకేరోజు ఉపాధి పొందిన కూలీల సంఖ్య ఐదు లక్షలకు చేరుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ రికార్డుపై రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనులను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. కూలీలకు నిరంతరం పని కల్పించడంతో పాటు గ్రామాల్లో దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూర్చే అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. ముఖ్యంగా జల సంరక్షణ పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి పిలుపునిచ్చారు. వర్షపు నీటిని ఒడిసిపట్టడం, భూగర్భ జలాల మట్టాన్ని పెంచడం, చెరువులు, కుంటల పునరుద్ధరణ, నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచే పనులను ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టాలని సూచించారు.
గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయంపై ఆధారపడే కుటుంబాలకు ఉపాధి కల్పించడంలో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తోంది. స్థానికంగానే పని దొరకడం ద్వారా కూలీలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితులు తగ్గుతాయి. అదే సమయంలో గ్రామాల్లో నీటి వనరుల అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, భూసార పరిరక్షణ వంటి పనులు చేపట్టేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో ఒకేరోజు ఐదు లక్షల మంది పనులకు హాజరుకావడం ఉపాధి హామీ కార్యక్రమాల అమలులో కీలక పరిణామంగా నిలిచింది. రానున్న రోజుల్లోనూ ఇదే స్థాయిలో ఉపాధి కల్పిస్తూ, గ్రామీణ ప్రాంతాల్లో జల సంరక్షణ పనులను మరింత విస్తృతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.





























