23 రోజులుగా ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల పోరాటం

ప్రభుత్వం స్పందించాలి, ఉద్యోగులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలి

బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి

ప్రతిపక్షం ప్రతినిధి, మెదక్ నవంబర్ 04: తమ న్యాయమైన హక్కుల సాధన కోసం ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు 23 రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి అన్నారు. బుధవారం మెదక్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద నిరసన తెలుపుతున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులను కలిసి ఆయన సంఘీభావం ప్రకటించారు. వారి పోరాటానికి బీఆర్‌ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజారోగ్య పరిరక్షణలో ఎన్నో ఏళ్లుగా కీలక సేవలందిస్తున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలని, జీవో 60, జీవో 1195 ప్రకారం పెంచిన వేతనాలను అమలు చేయాలని కోరారు. ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలను రద్దు చేసి ఉద్యోగులను స్టేట్ హెల్త్ సొసైటీ పరిధిలో కొనసాగించాలని, సకాలంలో వేతనాలు చెల్లించాలని అన్నారు. మహిళా ఉద్యోగులకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు కల్పించడంతో పాటు పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు హరీష్ రావు దృష్టికి తీసుకెళ్తానని తిరుపతిరెడ్డి హామీ ఇచ్చారు. ఉద్యోగుల హక్కుల సాధన కోసం బీఆర్‌ఎస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వెంటనే ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపి సమస్యలకు పరిష్కారం చూపాలని, ధర్నా విరమించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే సైతం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని సూచించారు.ఈ కార్యక్రమంలో టీఎన్జీవో మాజీ అధ్యక్షులు శ్యామ్ రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కసిరెడ్డి మాణిక్య రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ బట్టి ఉదయ్ కుమార్, నాయకులు మాయ మల్లేశం, ఇందాద్, సాయి, చంద్ర మోహన్ గౌడ్, సతీష్ రావు, శ్రీనివాస్, గంజి నవీన్, స్వామి నాయక్, నర్సారెడ్డి, భాను తదితరులు పాల్గొన్నారు.

Related News

Latest News