ప్రతిపక్షం, జూలై 06: ప్రకాశం జిల్లాలోని రాచర్ల మండలం చిన్నగానిపల్లిలో జరిగిన ఓ వివాహ వేడుకలో సినిమాను తలపించే ఘటన చోటుచేసుకుంది. పెళ్లి ఊరేగింపు సందర్భంగా వధువు ఆనందంగా డ్యాన్స్ చేయడాన్ని వరుడు అభ్యంతరం వ్యక్తం చేస్తూ అందరి సమక్షంలో ఆమెను మందలించాడు. ఈ ఘటనతో అక్కడ ఉన్న బంధువులు, అతిథులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు.
వరుడి ప్రవర్తనను గమనించిన వధువు తండ్రి, పెళ్లికి ముందే ఇలా వ్యవహరిస్తే భవిష్యత్తులో తన కుమార్తె ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని భావించి కీలక నిర్ణయం తీసుకున్నారు. వెంటనే వివాహాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించి పెళ్లిని నిలిపివేశారు. అనంతరం ఇరు కుటుంబాలు చర్చలు జరిపి కట్నం, కానుకలకు సంబంధించిన అంశాలను పరస్పర అంగీకారంతో పరిష్కరించుకుని విడిపోయాయి.
చివరి నిమిషంలో పెళ్లి రద్దు కావడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ విస్తృతంగా చర్చకు దారితీశాయి.















