50 గంటల పాటు కళా జాతర నిర్వహణ
ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మెదక్ లో కరపత్రం విడుదల
ప్రతిపక్షం ప్రతినిధి, మెదక్, సెప్టెంబర్ 21: అరుణోదయ విమలక్క 50 ఏళ్ల కళా, సాంస్కృతిక ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఈ నెల 26, 27, 28 తేదీల్లో 50 గంటల పాటు ప్రజా కళా జాతర నిర్వహించనున్నట్లు రైతు కూలీ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు బోనాల స్వామి తెలిపారు. సోమవారం మెదక్ జిల్లా కేంద్రంలోని గుల్షన్ క్లబ్ వద్ద ప్రజా కళా జాతర పోస్టర్‌ను ప్రజా సంఘాల నాయకులతో కలిసి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా బోనాల స్వామి మాట్లాడుతూ.. విమలక్క ఐదు దశాబ్దాల ప్రస్థానంలో పాడిన పాటలను ఆలపిస్తూ, ఆమెతో గొంతు కలిపి ప్రజా ఉద్యమాల్లో సాంస్కృతిక స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. 26, 27, 28 తేదీల్లో హైదరాబాద్‌లోని ఆర్టీసీ కళా మండపం, బాగ్‌లింగంపల్లిలో ఆట, పాట, మాటలతో 50 గంటల పాటు ప్రజా కళా జాతర కొనసాగుతుందని తెలిపారు.
జిల్లాలోని కళాకారులు, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, మేధావులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో రైతు కూలీ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా ఉపాధ్యక్షుడు రమేష్‌తో పాటు ప్రజా సంఘాల నాయకులు ఎల్లం, రమేష్, శ్రీనివాస్, మల్లేశం, గోపాల్, మహేందర్, పీడీఎస్‌యూ (విజృంభణ) విద్యార్థి నాయకుడు మహేష్ తదితరులు పాల్గొన్నారు.





























