గణేశ్ నిమజ్జనానికి ఎస్సారెస్పీ నుంచి నీటి విడుదలకు ప్రభుత్వం నిర్ణయం
ప్రతిపక్షం బ్యూరో,కరీంనగర్, సెప్టెంబర్ 21: గణేశ్ నిమజ్జనానికి చింతకుంట కెనాల్‌లో నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు, కార్యకర్తలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ధర్నా చేస్తున్న కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు లాఠీఛార్జ్ చేశారని బీజేపీ నాయకులు ఆరోపించారు.ఈ ఘటనలో బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్‌తో పాటు పలువురు కార్యకర్తలు గాయపడ్డారని పార్టీ నాయకులు పేర్కొన్నారు. కరీంనగర్ డిప్యూటీ మేయర్ సునీల్ రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం, కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ రావు తదితరులను పోలీసులు అరెస్ట్ చేసి కరీంనగర్ పీటీసీకి తరలించినట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి.
గణేశ్ నిమజ్జనానికి నీటిని విడుదల చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. అర టీఎంసీ నీటిని విడుదల చేయాలని కోరినా ప్రభుత్వం స్పందించలేదని వారు ఆరోపించారు. నిమజ్జనానికి నీరు అందించే వరకు ఆందోళన కొనసాగిస్తామని ప్రకటించారు.
500 క్యూసెక్కుల నీటి విడుదల బీజేపీ ఆందోళన నేపథ్యంలో గణేశ్ నిమజ్జనానికి అవసరమైన నీటిని SRSP నుంచి చింతకుంట కెనాల్‌కు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. తొలుత 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా, సాయంత్రం మరో 3,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపినట్లు సమాచారం.విడుదల చేసిన SRSP నీరు రేపు రాత్రిలోపు చింతకుంట కెనాల్‌కు చేరుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. నీటి విడుదలపై అధికారిక ప్రకటన, పోలీసుల చర్యలపై అధికారిక వివరాలు వెలువడాల్సి ఉంది.






























