మహిళల ఆర్థిక స్వావలంబనకు చదువే అసలైన పునాది.. జూపల్లి కీలక ప్రకటన

ప్రతిపక్షం, నవంబర్ 04: మహిళలు అక్షరాస్యులుగా మారినప్పుడే సమాజంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడంతో పాటు ఆర్థికంగా స్వతంత్రంగా ఎదిగేందుకు మరిన్ని అవకాశాలు లభిస్తాయని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ప్రతి ఒక్కరికీ చదవడం, రాయడం రావాలన్నదే తన ఆకాంక్ష అని స్పష్టం చేశారు. చదువుకోవడానికి వయసుతో ఎలాంటి సంబంధం లేదని, నేర్చుకోవాలనే ఆసక్తి, పట్టుదల ఉంటే ఏ వయసులోనైనా అక్షరజ్ఞానం సాధించవచ్చని పేర్కొన్నారు.

బుధవారం కొల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పానగల్ మండలం తెల్లరాళ్లపల్లి గ్రామంలో నిరక్షరాస్య మహిళలకు చదువు నేర్పించేందుకు మంత్రి ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా మహిళలకు పలకలు, బలపాలు పంపిణీ చేసి చదువుపై ఆసక్తి పెంపొందించే ప్రయత్నం చేశారు. గ్రామంలోని మహిళలు అక్షరాలు నేర్చుకునేందుకు వీలుగా ప్రతిరోజూ ఉదయం గంటసేపు, సాయంత్రం గంటసేపు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. ఈ తరగతుల నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని గ్రామ సర్పంచ్‌ను ఆదేశించారు. మహిళలు క్రమం తప్పకుండా తరగతులకు హాజరయ్యేలా ప్రోత్సహించాలని సూచించారు.

గతంలోనే ఈ కార్యక్రమానికి సంబంధించి అవసరమైన కొనుగోళ్ల కోసం మంత్రి జూపల్లి కృష్ణారావు రూ.10 వేల ఆర్థిక సాయం అందించారు. తాజాగా తన వంతు సహాయంగా మరో రూ.20 వేల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. మహిళలకు అక్షరజ్ఞానం అందించడం ఒక్కరోజుతో ముగిసే కార్యక్రమం కాకూడదని, నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని మంత్రి అభిప్రాయపడ్డారు. గ్రామంలోని ప్రతి నిరక్షరాస్య మహిళ చదవడం, రాయడం నేర్చుకునే వరకు ఈ ప్రయత్నం కొనసాగాలని ఆకాంక్షించారు.

మహిళల్లో చదువుపై మరింత ఆసక్తి, ఉత్సాహం పెంచేందుకు మంత్రి మరో కీలక ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. గ్రామంలో ముందుగా చదవడం, రాయడం నేర్చుకునే మహిళకు రూ.5 వేల నగదు బహుమతి అందజేస్తామని వెల్లడించారు. మహిళలు అక్షరాస్యులైతే కుటుంబ అభివృద్ధితో పాటు పిల్లల విద్య, సామాజిక చైతన్యం, ఆర్థిక స్వావలంబనకు కూడా బాటలు పడతాయని పేర్కొన్నారు. మహిళలు విద్య ద్వారా తమ జీవితాల్లో మార్పు తీసుకురావాలని, ఆత్మవిశ్వాసంతో అన్ని రంగాల్లో ముందుకు సాగాలని జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు.

Related News

Latest News