ప్రతిపక్షం, నవంబర్ 04: సోషల్ మీడియా పరిచయాలు కొందరి జీవితాల్లో కొత్త బంధాలకు దారితీస్తుంటే, మరికొందరి జీవితాల్లో తీవ్ర ఇబ్బందులను తెచ్చిపెడుతున్నాయి. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన వ్యక్తుల మధురమైన మాటలు, ఆకర్షణీయమైన ఫొటోలు, నమ్మించే వాగ్దానాలకు ఆకర్షితులై మహిళలు, యువతులు మోసపోతున్న ఘటనలు పెరుగుతున్నాయి. తెర వెనుక ఉన్న వ్యక్తి ఎవరు? అతడి నిజమైన ఉద్దేశం ఏమిటి? అనే విషయాలు తెలుసుకోకుండానే నమ్మకం పెంచుకోవడం కొన్నిసార్లు ఆర్థిక నష్టాలకు, వేధింపులకు, కుటుంబ కలహాలకు, చివరికి ప్రాణాపాయ పరిస్థితులకు కూడా దారితీస్తోంది. అందుకే ఆన్లైన్ పరిచయాల విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
ప్రస్తుతం చిన్నారుల నుంచి పెద్దల వరకు చాలామంది సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు వ్యక్తులు ఇన్స్టాగ్రామ్ ద్వారా మహిళలు, యువతులతో పరిచయాలు పెంచుకుంటున్నారు. మొదట సాధారణ సందేశాలతో పలకరిస్తూ, ఆ తర్వాత క్రమంగా సాన్నిహిత్యం పెంచుకుంటున్నారు. ప్రేమ, పెళ్లి, మంచి భవిష్యత్తు వంటి ఆశలు చూపిస్తూ వారి నమ్మకాన్ని పొందుతున్నారు. కొందరు తమ వ్యక్తిగత అవసరాలు, సమస్యలు చెప్పుకుంటూ డబ్బులు అడుగుతున్నారు. మరికొందరు పరిచయాన్ని ఆసరాగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్నారు. అందమైన ప్రొఫైల్ ఫొటోలు, ఆకర్షణీయమైన పోస్టులు చూసి ఎదుటివ్యక్తి నిజాయతీపరుడని భావించడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్ పరిధిలోని ఖానాపూర్ మండలంలో ఇద్దరు బాలికలకు ఇన్స్టాగ్రామ్ ద్వారా గుర్తుతెలియని వ్యక్తి పరిచయమయ్యాడు. కొంతకాలం వారితో మాట్లాడి నమ్మకం పెంచుకున్న అనంతరం వారిని ఆటోలో హైదరాబాద్కు తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ పరిణామంతో భయాందోళనకు గురైన బాలికలు తమకు తెలిసినవారికి సమాచారం అందించారు. దీంతో పోలీసులు స్పందించి అక్కడికి చేరుకుని బాలికలను తిరిగి తీసుకొచ్చారు. సోషల్ మీడియా పరిచయాలు ఎంతటి ప్రమాదకర పరిస్థితులకు దారితీయవచ్చో ఈ ఘటన స్పష్టం చేస్తోంది.
మరోవైపు ఆన్లైన్ పరిచయాలను ఆసరాగా చేసుకుని ఆర్థిక మోసాలకు పాల్పడుతున్న ఘటనలు కూడా వెలుగుచూస్తున్నాయి. వరంగల్ పోలీస్ డివిజన్ పరిధిలోని మట్టెవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్టోబర్ 28న ఓ మహిళకు ఇన్స్టాగ్రామ్ ద్వారా గుర్తుతెలియని వ్యక్తి పరిచయమయ్యాడు. కొద్దిరోజుల పాటు ఆమెతో మాట్లాడి నమ్మకం సంపాదించిన అనంతరం తనకు ఆర్థిక అవసరాలు ఉన్నాయని చెప్పి డబ్బులు కావాలని కోరాడు. అతడి మాటలు నమ్మిన మహిళ ఆన్లైన్ ద్వారా రూ.63 వేలు బదిలీ చేసింది. డబ్బులు అందుకున్న తర్వాత ఆ వ్యక్తి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాను మార్చేయడంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
సోషల్ మీడియా పరిచయాలు కొన్ని కుటుంబాల్లోనూ కలహాలకు కారణమవుతున్నాయి. హనుమకొండ పోలీస్ డివిజన్ పరిధిలో ఇటీవల ఓ వివాహిత ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన వ్యక్తిని నమ్మి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమె కనిపించకపోవడంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేశారు. అనంతరం వారిని గుర్తించి విచారించగా, తనకు ఇష్టమైన వ్యక్తితో స్వచ్ఛందంగా వెళ్లినట్లు సదరు మహిళ తెలిపినట్లు సమాచారం. ఈ ఘటన కుటుంబ సంబంధాలు, వ్యక్తిగత నిర్ణయాలు, సోషల్ మీడియా పరిచయాల మధ్య ఏర్పడుతున్న సంక్లిష్ట పరిస్థితులను తెలియజేస్తోంది.
తెలియని వ్యక్తులతో ఆన్లైన్లో మాట్లాడేటప్పుడు వారి వివరాలను పూర్తిగా తెలుసుకోకుండా వ్యక్తిగత సమాచారం, ఫొటోలు, చిరునామా, బ్యాంకు వివరాలు పంచుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. ఆర్థిక అవసరాల పేరుతో డబ్బులు అడిగితే వెంటనే పంపకుండా నిజానిజాలు నిర్ధారించుకోవాలని చెబుతున్నారు. ముఖ్యంగా ప్రేమ, పెళ్లి లేదా ఉద్యోగం పేరుతో పరిచయం పెంచుకుని డబ్బులు వసూలు చేసే వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. బెదిరింపులు, వేధింపులు ఎదురైతే భయపడకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.
మధురమైన మాటలు చెప్పేవారంతా మంచివారే అనుకోవడం పొరపాటని, ఆన్లైన్లో కనిపించే వ్యక్తి నిజస్వరూపం తెలుసుకోవడం అంత సులభం కాదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. సోషల్ మీడియాను ఉపయోగించడంలో విచక్షణ, అప్రమత్తత తప్పనిసరి. కాసేపటి పరిచయం కోసం జీవితాన్ని ప్రమాదంలోకి నెట్టుకోవద్దని, ముఖ్యంగా యువతులు, మహిళలు ఆన్లైన్ స్నేహాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు.


























