ముఖ్యమంత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు

సున్నం చెరువు, తమ్మిడికుంట చెరువుల వద్ద భద్రతా ఏర్పాట్లపై సీపీ సమీక్ష

సైబరాబాద్, ప్రతిపక్షం,నవంబర్ 4: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిపాదిత పర్యటన నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. పర్యటనకు సంబంధించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా భద్రతా ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్ అధికారులను ఆదేశించారు.

మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సున్నం చెరువు, తమ్మిడికుంట చెరువులను బుధవారం ఆయన స్వయంగా సందర్శించి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో చేపట్టాల్సిన భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా కూకట్‌పల్లి జోన్ డీసీపీ రితిరాజ్, ఐపీఎస్, మాదాపూర్ డివిజన్ ఏసీపీ సీహెచ్. శ్రీధర్, డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ పి. రమేష్‌తో పాటు ట్రాఫిక్ పోలీసు అధికారులు పాల్గొన్నారు.

పర్యటన జరిగే ప్రాంతాల్లో ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించాలని సీపీ సూచించారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ అన్ని ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి పర్యటన ప్రశాంతంగా, సురక్షితంగా సాగేలా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు.

Related News

Latest News