- ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ హెచ్చరిక.
ప్రతిపక్షం బ్యూరో, ఉమ్మడి కరీంనగర్, జూన్ 29: కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ వద్ద ఈరోజు అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్‌రూమ్, ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నిరుపేదలతో పెద్ద ఎత్తున దరఖాస్తులు సమర్పించారు.అనంతరం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ మాట్లాడుతూ కరీంనగర్ పట్టణంలో గత 20 సంవత్సరాలుగా సొంత ఇల్లు లేక, కిరాయి ఇండ్లలో ఉంటూ కూలీ పనులు చేసుకుంటున్న పేదలు ఎందరో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే భర్తను కోల్పోయి, పిల్లలను సాకుతూ అత్యంత దీన స్థితిలో బతుకులీడుస్తున్న వితంతువులకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు.అనర్హుల కేటాయింపులపై సమగ్ర విచారణ జరపాలి:ఇటీవల కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరిగిన డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల కేటాయింపుల్లో భారీ అక్రమాలు జరిగాయని బండారి శేఖర్ ఆరోపించారు. దాదాపు 100 మందికి పైగా అనర్హులకు, ముఖ్యంగా అధికార పార్టీ నాయకుల అనుచరులకు ఎలాంటి అర్హత లేకపోయినా ఇండ్లను కేటాయించారని మండిపడ్డారు. రాజకీయ సిఫార్సులతో జరిగిన ఈ కేటాయింపులపై తక్షణమే ఉన్నత స్థాయి కమిటీతో సమగ్ర విచారణ జరిపించి, వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.”అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వం ఇండ్లు ఇస్తుందా? లేక లబ్ధిదారులను తీసుకొని మేమే ఇండ్లను ఆక్రమించాలా?” అని ఆయన ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్ ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధ వహించి, అనర్హుల జాబితాను తొలగించి, నిజమైన నిరుపేదలకు న్యాయం చేయాలని ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పేదల పక్షాన పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బద్రి నేతతో లబ్దిదారులు పాల్గొన్నారు.

















