ఈ నెల 30 వరకే గడువు.. రైతులకు సూచన
చామలపల్లిలో డిజిటల్ క్రాప్ సర్వే.
మండల వ్యవసాయ అధికారి మల్లేష్.
ప్రతిపక్షం, చండూరు సెప్టెంబర్ 22: రైతులందరూ తప్పనిసరిగా ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి P.మల్లేష్ పిలుపునిచ్చారు. ఫార్మర్స్ రిజిస్ట్రీ జరుగుతున్న చామలపల్లి గ్రామాన్ని ఆయన సందర్శించి రైతులను ఉద్దేశించి మాట్లాడారు.ఫార్మర్స్ రిజిస్ట్రీ ఐడీ ద్వారానే రానున్న కాలంలో ఎరువులు కొనడం, పండించిన ధాన్యం, పత్తి, ఇతర పంటల ఉత్పత్తులు అమ్ముకోవడం జరుగుతుందని తెలిపారు.ప్రస్తుతం యూరియా, డీఏపీ మరియు ఇతర కాంప్లెక్స్ ఎరువులన్నీ కూడా ఫ్రేమ్ వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్ యాప్ ద్వారా మాత్రమే బుకింగ్ చేసుకుని తీసుకునే అవకాశం ఉందని, దీనిలో బుకింగ్ చేసుకోవాలంటే రైతు ఫార్మర్స్ రిజిస్ట్రీ చేసుకొని ఉండాలని స్పష్టం చేశారు.
కాబట్టి రైతు సోదరులు ఇంకా ఎవరైనా మిగిలిపోయిన వారు ఉంటే తమ వ్యవసాయ విస్తరణ అధికారిని మరియు దగ్గరలోని మీసేవ కేంద్రాన్ని సందర్శించి ఫార్మర్స్ రిజిస్ట్రీ చేసుకోవాలని సూచించారు. ఈ నెల 30 వరకు మాత్రమే అవకాశం ఉందని, రైతులు గమనించి త్వరగా చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.అదేవిధంగా ప్రస్తుతం సర్వే నంబర్ వారీగా డిజిటల్ క్రాప్ సర్వే జరుగుతోందని, రైతు పొలంలో ఏం పంట వేశారనేది ఏఈవోలు, గ్రామ వాలంటీర్లు ఆన్‌లైన్ చేయడం జరుగుతుందని తెలిపారు. వరి వేసిన రైతులు ముఖ్యంగా సన్నధాన్యం వేశారా, దొడ్డు ధాన్యం వేశారా అనేది వాలంటీర్ కు చెప్పాలని, పంటల నమోదు అయిందా లేదా అనే విషయాన్ని సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారిని కలిసి చూసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆంజనేయులు, పంచాయతీ సెక్రెటరీ లింగస్వామి, ఏఈవో జగన్ మరియు ఇతర రైతులు పాల్గొన్నారు.




























