గ్రామ పంచాయతీలకు గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా బ్యాంకు ఖాతాల్లోకే ఆదాయం!

ప్రతిపక్షం, నవంబర్ 07: తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం శుభవార్త అందించింది. గ్రామ పంచాయతీలకు వివిధ మార్గాల ద్వారా సమకూరే సొంత ఆదాయాన్ని ఇకపై నేరుగా ఆయా పంచాయతీల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు గ్రామ పంచాయతీలకు వచ్చే సొంత ఆదాయాన్ని ప్రభుత్వ ట్రెజరీ ఖాతాలో జమ చేసే విధానం అమల్లో ఉండేది. అయితే తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఆ విధానంలో మార్పులు తీసుకొచ్చారు. పంచాయతీల ఆదాయాన్ని నేరుగా వాటి సొంత బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఈ కొత్త విధానం అక్టోబర్ 9వ తేదీ నుంచే అమల్లోకి వచ్చినట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

గతంలో అమల్లో ఉన్న విధానం కారణంగా గ్రామ పంచాయతీలు తమకు వచ్చిన ఆదాయాన్ని స్థానిక అవసరాల కోసం వినియోగించుకోవడంలో పలు ఇబ్బందులు ఎదుర్కొనేవి. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, వీధి దీపాల ఏర్పాటు, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య కార్మికులు, ఇతర సిబ్బంది జీతభత్యాలు, చిన్నచిన్న మరమ్మతులు, అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవసరమైన నిధుల కోసం ప్రభుత్వ అనుమతులు తీసుకోవాల్సి వచ్చేది. నిధుల విడుదల ప్రక్రియలో జాప్యం జరగడంతో కొన్ని సందర్భాల్లో అత్యవసర పనులు కూడా సకాలంలో చేపట్టలేని పరిస్థితులు ఏర్పడేవి. చేసిన పనులకు సంబంధించిన బిల్లులు చెల్లింపులు కాకపోవడం వల్ల పంచాయతీల నిర్వహణలోనూ ఇబ్బందులు ఎదురయ్యేవి.

ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్త విధానం ప్రకారం గ్రామ పంచాయతీలకు వచ్చే సొంత ఆదాయం నేరుగా వాటి బ్యాంకు ఖాతాల్లో జమ కానుంది. దీంతో స్థానిక అవసరాలకు అనుగుణంగా నిధులను వినియోగించుకునేందుకు పంచాయతీలకు మరింత వెసులుబాటు లభించనుంది. ముఖ్యంగా పారిశుద్ధ్య నిర్వహణ, గ్రామీణ మౌలిక సదుపాయాల మెరుగుదల, అత్యవసర మరమ్మతులు, సిబ్బంది జీతభత్యాల చెల్లింపుల విషయంలో నిధుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి కొంతవరకు తగ్గనుంది. గ్రామ స్థాయిలోనే ఆర్థిక నిర్వహణకు అవకాశం కలగడంతో పంచాయతీల పాలనలో వేగం పెరిగే అవకాశం ఉంది. ఈ నిర్ణయం ద్వారా గ్రామ పంచాయతీలు తమ సొంత ఆదాయాన్ని మరింత సమర్థంగా వినియోగించుకుంటూ స్థానిక అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లగలవని భావిస్తున్నారు.

Related News

Latest News